పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుని కొరకే దేవుణ్ణి సేవించేవాడనని నిరూపించుకొన్నాడు. ప్రభువు అతని చిత్తశుద్ధిని మెచ్చుకొని ఈసాకుకి బదులుగా ఓ పొట్టేలుని చూపగా అబ్రాహాము దాన్నే దహన బలిగా సమర్పించాడు. ఈసాకుని చావునుండి తప్పించిన దేవుడు మృత్యువుని గాక జీవాన్ని కోరేవాడు - సాలోమోను జ్ఞాన 1, 13. అసలు అతడు నరజాతినుండి మృత్యువుని తొలగిస్తాడు. ఈసాకు సూచించే క్రీస్తు సిలువమరణం ద్వారా ఈ కార్యం జరుగుతుంది. కట్టెలమోపు మోసికొని బలికావడానికి సిద్ధమై వెళ్లిన యీసాకు భావికాలంలో సిలువను మోసికొనిపోయే క్రీస్తుకి చిహ్నంగా వుంటాడు - ఆది 22, 6. ఓ రెండువేల యేండ్ల కడచాక యెరూషలేములో ఈ సూచనం నెరవేరుతుంది - రోమా 8, 32.

{center|

3. ధన్యుడైన తండ్రి

}

దేవుడు అబ్రాహాము విధేయతనూ విశ్వాసాన్నీ మెచ్చుకొని "నేను నిన్ను అధికంగా దీవిస్తాను. ఆకాశ నక్షత్రాల్లాగ, సముద్రతీరంలోని యిసుకరేణువుల్లాగ నీ సంతానం అసంఖ్యాకంగా వృద్ధిచెందుతుంది. లోకంలోని జాతులన్నీ నీ సంతానం ద్వారా దీవెనలు పొందుతాయి. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక ఇదంతా జరుగుతుంది" అని చెప్పాడు - ఆది 22, 17-18, ఇవి చాల గొప్ప దీవెనలు. సీరా చెప్పినట్లుగా అబ్రాహాము కీర్తి అనన్య సామాన్యమైంది - 44,19, అసలు దేవుడు అబ్రాహాముని పిల్చింది అతడు బహుజాతులకు తండ్రికావాలనే. కనుక అతని గొప్పతనమంతా అతని సంతానంలోనే యిమిడివుంది. అబ్రాహాము తొలి పేరు అబ్రాము. ఈ పేరుకి గొప్పవాడైన తండ్రికి జన్మించినవాడని అర్థం. దేవుడు ఈ పేరుని అబ్రాహాముగా మార్చాడు. ఈ రెండవ పేరుకి అనేక జాతులకు తండ్రి అని అర్థం. కనుక తన పేరుకి తగినట్లుగానే అతడు నానాజూతులవారికి పిత - ఆది 17,5. అబ్రాహాము పొందిన దీవెనలు అతనినుండి ఉద్భవించే నానాప్రజల్లోకి గూడ దిగివస్తాయి. ఆ ప్రజలద్వారా నానా జాతులూ దీవెనలు పొందుతాయి - ఆది 22, 18 ఏలాగ? ఈ సంతానంనుండే భావికాలంలో మెస్సీయా పుడతాడు. అతని ద్వారా అన్ని జాతులవాళ్ళూ శుభాలు పొందుతారు. ఈలా అబ్రాహాముతో ప్రారంభమైన దీవెనలు మెస్సియా ద్వారా ముగుస్తాయి. కనుక అబ్రాహాము ధన్యుడైన తండ్రి, నానా జాతులకూ పిత, పూర్వవేదకాలం చివరలో వచ్చిన సీరా అబ్రాహామునిస్తుతిస్తూ "అతని వంశజులవలన లోకానికి దీవెనలు అబ్బుతాయని దేవుడు రూఢిగా ప్రమాణం చేసాడు" అని చెప్పాడు - 44,21. ఆదాము అవిశ్వాసం పాపపు నరజాతి అవిశ్వాసాన్ని సూచించినట్లే, అబ్రాహాము విశ్వాసం ఉద్ధరింపబడిన నరజాతి విశ్వాసాన్ని సూచిస్తుంది. 2O3