పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.బాధామయ సేవకుడు ప్రధానంగా బాధలు అనుభవించినవాడు. అతడు చేసిన గొప్ప కార్యం ఇదే. అతడు సూచించే క్రీస్తుకూడ శ్రమలు అనుభవించినవాడు. గురువుకి ఒక త్రోవ శిష్యుడికి ఇంకొక త్రోవ వుంటుందా? కావున నేడు మనకుకూడ శ్రమలు తప్పవు. వాటిని మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వీకరంచి దేవునికి సమర్పించాలి.

6.సేవకుడు ప్రవక్త ప్రభువు వాక్కుని విని దాన్ని ఇతరులకు బోధించినవాడు. ఆ వాక్కు అతనికి పదునైన కత్తిలా, బాణంలా ఉపయోగపడింది — యొష 49,21. క్రీస్తుకూడ తండ్రి వాక్కుని బోధించినవాడే. ఈ భక్తులను అనుసరించి మనంకూడ వాక్యబోధకు పూనుకోవాలి. ఎవరి శక్తికొలది వాళ్ళ ఇతరులకు వాక్యాన్ని విన్పించాలి.

7.సేవకునికి తన పనిలో నిరుత్సాహం కలిగింది. ప్రవాసులు అతని బోధను వినలేదు. పైగా అతన్ని బాధించారు - యెష49, 4 క్రీస్తుకూడ యూదప్రజలు తన్ను అంగీకరించనందుకు నిరుత్సాహపడ్డాడు. కడకు తన శిష్యులుకూడ తన్ను అపార్థం చేసికొన్నందుకు బాధపడ్డాడు. నేడు మన జీవితంలోకూడ అపజయాలూ నిరుత్సాహ భావాలూ తప్పవు. లౌకిక ఆధ్యాత్మికరంగాల్లో కూడ మనకు నిరుత్సాహం ఎదురౌతుంది. కాని మనం ఓడిపోం, ప్రభువు బలంవలన గెలుస్తాం. కనుక మన నిరుత్సాహాలను గూడ ప్రభువుకే అర్పించుకోవాలి.

8.సేవకుని జీవితానికి అర్థముంది. అతడు శ్రమలు అనుభవించి ప్రజలకు మేలు చేసిపెట్టాడు. క్రీస్తుకూడ ఈలాగే చేసాడు. అతని జీవితంకూడ అర్థవంతమైంది దివ్యమైంది. నేడుమనంకూడ ఈ భక్తుల్లాగే జీవించి మనజీవితాన్ని ధన్యం చేసికోవాలి. క్రైస్తవుడి జీవితం క్రీస్తుని అనుసరించేది, పవిత్రమైంది. మనకు ప్రేరణ కలగడానికి పై బాధామయ సేవకుని గీతాలను పలుమారులు భక్తితో చదువుకోవాలి. విశేషంగా తపసు కాలంలో వీటిని మననం చేసికోవాలి. మన జీవితాన్ని ఉదాత్తంగా మలుచుకోవాలి.