పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. పూరీము ఉత్సవం 9, 20–10, 1

పూర్వం హామాను అదారు నెల 13వ తేదీన యూదులను చంపాలని నిర్ణయించాడు. కనుక ఈనెల 18, 14 తారీఖుల్లో యూదులు పూరీము ఉత్సవాన్ని జరుపుకోవాలని మొర్టెకయి, ఎస్తేరు ఆజ్ఞాపించారు. ఆ యిద్దరు యూదుల అభివృద్ధి కొరకు, పారశీకరాజ్యం శ్రేయస్సుకొరకు కృషిచేసారు.

పూర్వం మొర్టెకయి కలలో రెండు సర్పాలు పోట్లాడుకోవడం, ఓ నది పుట్టటం చూచాడు. ఆసర్పాలు హామాను, తాను. ఆ నది ఎస్తేరు.

4. పుస్తకం సందేశం

ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు మొర్టెకయి, ఎస్తేరు. మొర్టెకయి తెలివితో హామాను కుట్రను తప్పించుకొన్నాడు. అతడు ఎస్తేరును ప్రోత్సహించి ఆమె రాజునుండి యూదులకు ప్రాణభిక్షను సంపాదించి పెట్టేలా చేసాడు. ప్రధానమంత్రి అయ్యాక యూదుల శ్రేయస్సుకొరకు కృషిచేసాడు. ఇతనిలాగే మనమూ మన సుగుణాలనూ, సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

ఎస్తేరు ఆదర్శ వనిత. ఆమె తన ప్రజల శ్రేయస్సుకొరకే జీవించింది. ప్రాణాపాయాన్నిగూడ లెక్కచేయక రాజు సన్నిధిలోకి వెళ్ళి యూదులకు ప్రాణభిక్ష పెట్టమని వేడింది. ధైర్యంతో హామాను కుట్రను రాజుకి ఎరిగించింది. ఆమెలో ధైర్యం, దైవభక్తి, విధేయత మొదలై సుగుణాలు వున్నాయి. ఐతే నేటి స్త్రీ విమోచనవాదులు ఎస్తేరుకంటే వష్టినే ఎక్కువగా మెచ్చుకొంటారు. వష్టి స్త్రీగా తన గౌరవాన్ని కాపాడుకోవడానికి రాణి పదవిని త్యజించింది. తర్వాత ఎస్తేరు ఆమె స్థానాన్ని ఆక్రమించుకొంది. కాని వష్టిలో వున్న ఆత్మాభిమానం, స్వతంత్రభావాలు ఈమెలో లేవు.

ఈ గ్రంథంలో ఆపదలో దేవుణ్ణి సహాయం అడుక్కోవడం, ప్రార్ధనం, ఉపవాసం మొదలైన సదాచారాలు వస్తాయి. ఇవి నేడు మనకు కూడా అవసరమే.

ఈ పుస్తకంలో విందులు చాల పర్యాయాలు వస్తాయి. ఇవి బైబుల్లో పదవీచ్యుతిని, పదోన్నతినీ కూడా సూచిస్తాయి. విందుల్లోనే వష్టి హామాను పడిపోయారు. విందుల్లోనే ఎస్తేరు తన కార్యాన్ని సాధించుకొంది. నేడు మనకు పాస్కవిందు, సత్రసాదవిందు ఉన్నాయి. మనం వీటిల్లో భక్తితో పాల్గొని ఆధ్యాత్మికాభివృద్ధిని పొందాలి.

పారశీక దేశంలో యూదులు అల్పసంఖ్యాకులు. వారి ప్రత్యేక జీవిత విధానాన్ని చూచి పారశీకులు వారిని ద్వేషించారు. నేడు ఇండియాలో మనం మైనారిటీ వర్గాలము. కనుక హిందువులు మనలను చులకన చేస్తారు.