పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



4. యూదులు పగ తీర్చుకోవడం 6, 1-9, 19

ఒక రోజు రాత్రి రాజు నిద్రపట్టక రాజకార్యాల దాస్తావేజులు చదివించుకొన్నాడు. వానిలో సేవకుల కుట్రనుండి మొర్టెకయి రాజును రక్షించాడనీ, అతనికే బహుమతి లభించలేదనీ వ్రాయబడివుంది. కనుక రాజు అతన్ని బహూకరించాలి అనుకొన్నాడు. ఆ వుదయమే హామాను మొర్టెకయి చావుకి అనుమతినీయమని అడగడానికి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు సత్కరించగోరినవాణ్ణి ఎలా సన్మానించాలని ప్రభువు మంత్రిని అడిగాడు. హామాను ఆ సన్మానం తనకేనని బ్రాంతిపడి అతన్ని గుర్రమెక్కించి ఊళ్ళ ఊరేగించాలి అన్నాడు. ప్రభువు ఈ పని నీవు మొర్టెకయికి చేయించు అని ఆజ్ఞాపించాడు. హామాను శత్రువుని వూళ్ళ ఊరేగించాడు. అతని మొగం చిన్నపోయింది. అతని భార్య మిత్రులు మొర్టెకయి నిన్ను ఓడిస్తాడు అని చెప్పారు. ఎస్తేరు ప్రార్థనను విన్నదేవుడే ఈ కార్యాన్నికూడా జరిపించాడు.

రాణి రెండవ విందు చేసింది. రాజు మంత్రి హాజరయ్యారు. ఆ విందులో ఆమె మాజాతి ప్రజలకు చావు మూడింది. ప్రభువులవారు మమ్ము కాపాడాలి అని వేడుకొంది. మంత్రి హామానే మాకు కీడు తలపెట్టాడని చెప్పింది. రాజు మంత్రిపై కోపించి ఉద్యానవనంలోకి వెళ్ళాడు. మంత్రి పడకమీద వాలి విందారగిస్తూన్న ఎస్తేరు కాళ్ళపైబడి తన్ను క్షమింపమని వేడుకొంటున్నాడు. అంతలో రాజు తిరిగివచ్చి వీడు నాయింటనే నా రాణినే మానభంగం చేస్తాడా యేమిటి అన్నాడు. వెంటనే సేవకులు అతని ముఖంమీద ముసుగువేసారు. రాజాజ్ఞపై మొర్టెకయి కొరకు సిద్ధంచేసిన ఉరికంబంమీదనే అతన్ని వ్రేలాడదీసారు. ఈలా మొర్టెకయి చావు హామాను చావుగా మారింది. మంత్రి తాను త్రవ్విన గోతిలో తానే పడ్డాడు. ఇది దైవ నిర్ణయం. ఈ ఘట్టంలో మంత్రిని పట్టియిూయడంలో ఎస్తేరు చూపిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. రాజు హామానుకు బదులుగా మొర్టెకయిని ప్రధానమంత్రిని చేసాడు.

యూదులు తమ్ము చంపడానికి వచ్చినవాళ్ళను తాము చంపవచ్చునని రాజు, మంత్రి క్రొత్త ఆజ్ఞ జారీచేసారు. యూదులు పారశీకులను 75,800 మందిని చంపి పగతీర్చుకొన్నారు. సంతోషంతో పూరీము ఉత్సవం చేసికొన్నారు. ఐతే, ఇలా పగతీర్చుకోవడం పూర్వవేదానికి తగుతుందిగానీ నూత్నవేదానికి తగదు. క్రీస్తు శత్రువులను క్షమించమన్నాడుగానీ, ప్రతీకారం చేయమనలేదు. నూత్నవేద వరప్రసాదం ఇంకా పూర్వవేదంపై సోకలేదు అనుకోవాలి.