పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



2. యూదితు గ్రంథం

1. గ్రంథ స్వభావం

క్రీస్తు పూర్వం 175-164 కాలంలో సిరియా దేశాన్నేలిన అంటియోకస్ ఎపిఫానీస్ అనే గ్రీకు రాజు యూదులను క్రూరంగా హింసించాడు. ఆ సందర్భంలో యూదులను ప్రోత్సహించడానికి రచయిత ఈ గ్రంధాన్ని వ్రాసాడు. దేవుడు బలహీనుల ద్వారాగూడ తన ప్రజలను కాపాడతాడని ఉద్బోధించాడు. ఈ పుస్తకం క్రీ.పూ. 150– 100 సంవత్సరాల మధ్య వెలువడి వుంటుంది. ఇపుడు దీని హీబ్రూ మూలం లభింపదు. గ్రీకు అనువాదం మాత్రమే దొరుకుతుంది. ఇది చారిత్రక గ్రంథంకాదు. దైవభక్తినీ, నీతినీ బోధించే కల్పిత గాథ, చిన్న నవల లాంటిది.

2. కథా సంగ్రహం

అస్పిరియా రాజైన నెబుకద్నెసరు, మాదియా రాజు మీదికి యుద్దానికి పోయాడు. పశ్చిమ ఆసియా రాజ్యాలు అస్పిరియా రాజుకి సామంత రాజ్యాలు. ఐనా అవి యుద్ధంలో అతనికి సహాయం చేయలేదు. కనుక అతడు ఆ దేశాలను శిక్షించడానికి తన సైన్యాధిపతియైన హోలోఫెర్నెసును బ్రహ్మాండమైన సైన్యంతో పంపాడు. ఇతడు వచ్చి యూదుల నగరమైన బెతూలియాను ముట్టడించాడు. యిప్రాయేలీయులు పాపం చేయందే వారిని జయించడం సాధ్యంకాదని అమ్మోనీయుల నాయకుడు అకియోరు సేనానికి సలహాయిచ్చాడు. ఐనా సేనాపతి వినలేదు.

హోలోఫెర్నెసు బెతూలియా పట్టణానికి నీటి సరఫరాను ఆపివేసాడు. నగరపౌరులు శత్రువుకి లొంగిపొండని తమ నాయకులను వత్తిడిచేసారు. ఇంకా ఐదు రోజుల్లో దైవసహాయం అందకపోతే లొంగిపోతామని ఆ నాయకులు మాటయిచ్చారు.

ఆ పరిస్థితుల్లో యువ వితంతువైన యూదితు ముందుకు వచ్చి విరోధికి లొంగకూడదనీ అతన్ని ఎదిరించి పోరాడాలనీ సలహా యిచ్చింది. తాను స్వయంగా నగరాన్ని కాపాడుతానని వాగ్దానం చేసింది. ఆమె దాసితో శత్రువు శిబిరానికి వెళ్ళింది. బెతూలియాను నీవశం చేస్తానని చెప్పి హోలోఫెర్నెసును ఉబ్బించింది. అతనికి ఆమెపై మరులు పట్టాయి. నాల్గవనాడు అతడు ఆమెను చెరపగోరి విందుకి ఆహ్వానించాడు. ఆమె అందానికి తబ్బిబ్బలై ద్రాక్షసారాయాన్ని విపరీతంగా త్రాగి మైకంలో పడిపోయాడు. యూదితు అతని తలను నరికి బెతూలియాకు తీసికొనిపోయింది. యిప్రాయేలీయులు శత్రువుల మీదికి దాడిచేసి వారిని ఓడించి కొల్లసామ్మ దోచుకున్నారు.