పుట:Bharatiyanagarik018597mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈరాజ్యనిర్మాణమునుగూర్చి పెక్కుగాథలు గాంచనగుచున్నవి. హున్‌టియస్ అనుబ్రాహ్మణు డీరాజ్యముపై దండెత్తి, యిచటిరాణిని బరిణయమాడి యీదేశమునకు రాజయ్యెనని చైనాదేశీయుల వ్రాతలు దెలుపుచున్నవి. ఈహున్‌టియన్ అనునతడే కౌండిన్యుడనియు, నీవృత్తాంతము క్రీ. శ. 1 వ శతాబ్దమున జరగెననియు, పెలియట్ అను ఫ్రెంచిపండితుడు వ్రాసియున్నాడు. మరికొన్ని చైనాచరిత్రములలో క్రీ. శ. 2 వ శతాబ్దాంతమున చైనాదేశమును హ్యాన్‌వంశీయులేలుచుండగా "కెయులియన్" అను నతడు చంపారాజ్యమును స్థాపించెనని యున్నది. చంపాలోవోకాన్ అనుచోట దొరికిన క్రీ. శ. 3 వ శతాబ్దినాటి సంస్కృతశాసనమున నాకాలమున శ్రీమారునిసంతతివారు చంపాపాలకులుగనుండిరని చెప్పబడినది. దీనినుండి మాస్బేర్స్ అను ఫ్రెంచిపండితుడు కియున్‌లియన్‌ను, శ్రీమారుడు నొక్కరేయనియు, నీతడు క్రీస్తుశకము రెండవయంత్యభాగమున చంపారాజ్యమును స్థాపించెననియు వ్రాసియున్నాడు. కాని కియన్ లియన్ అనునది కౌండిన్యుని పేరనియు, నాతడే యీరాజ్యమును క్రీ. శ. 1 వ శతాబ్దిలో నిర్మించెననియు, దీనిని రెండవశతాబ్దమునుండి శ్రీమారుడు నాతనిసంతతివారు నేలిరనియు జెప్పుట సమంజసముగ నుండును. ఏది యెట్లున్నను క్రీస్తు శకారంభమున భారతీయు లిచటికి వలసవచ్చిరని స్పష్టమగుచున్నది. అయినచో వీర లెచటివారు? అను సమస్యయొకటి బయల్వెడలును. "చంపా" యను నీరాజ్యనామమును బట్టి వీరార్యావర్తమునందలి ప్రాగ్భాగమునుండి వచ్చిరేమోయని తోచుచున్నది. కాని వోకాన్ శాసనము దక్షిణహిందూదేశమును సూచించుచున్నది. ఈశాసనమునందలి భాషయు, లిపియు, క్షత్రపరుద్రదాముని గిర్‌నార్ శాసనమును, ఆంధ్రవాసిష్ఠీపుత్రుని కన్హేరిశాసనమును పోలియున్నవి. ఈవిషయముల నన్నిటిని చర్చించి జదునాథ్ సర్కారుగారు "చంపారాజ్యమునేలిన మొదటి రాజవంశము గోదావరీ కృష్ణా నదీతీరములనుండి వచ్చిరని చెప్పవలసి యున్న"దని నిశ్చయించినారు.