పుట:Bhaarata arthashaastramu (1958).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలములో నమృత మలభ్యమయ్యెనని కొందఱు మొరలిడెదరు. వారు బుద్ధిహీనులు. ఆకలి, తృష్ణ, ఇత్యాది వ్యసనము లస్తమించిన లోకములో పెండ్లాలుండరు. అందఱును భోగపుసానులగుదురు. కావున గృహస్థధర్మములకు దావలములు ఆర్థిక ప్రయాసములు.

బలాత్కార సంశ్లేష

పూర్వకాలమున చిల్లరచిల్లరతెగలు, అమేయములుగ నుండినందున సదా యుద్ధములు నడుచుచు దినదినాచారములలో జేరినవిగా నుండెను. పరాజయము నొందినవారల బానిసలం జేయుటయు బ్రసిద్ధము. భారతములో షోడశరాజుల చరిత్రలు చదివినవారెల్లరు, అప్పటిభూపతులు వేనవేలు స్త్రీ పురుషుల బ్రాహ్మణాదులకు దాసీదాస జనంబులుగా కోళ్ళను గొఱ్ఱెలను మనము బహుమానమిచ్చు నటుల దానముజేయుట దలపోసి, యిట్టి దౌర్భాగ్యకాలములు వర్ణనీయ యుగములాయని యాశ్చర్యపడి యుందురేమో! శత్రువుల యొక్కయు దుదకు ప్రజలయొక్కయు స్వాతంత్ర్యములం గొల్ల గొట్టుట పెద్దలనాటి పరమ ధర్మము. ఈ రీతుల జనులను దమకు లొంగునటులుచేసి వారితో బని జేయించు కొనుటయు నొకవిధమైన యార్థిక సంశ్లేషయ. దీనికి 'నిర్బంధ సంశ్లేష' మనిపేరు. భార్యలును సేవకమండలిలో జేరినవారుగ వగవబడినవారగుటచే వివాహముల యందును బలముం బ్రయోగించుట యపుడాచారముగ నుండెను. ఆనాళ్ళ ప్రభావములింకను నశింపక మనలో నిలిచియున్నవి.

రానురాను బలాత్కార సంయోగములు క్షీణతకు వచ్చినవి. కుల, వర్ణాది బంధనము లింకను వీడకున్నను, పూర్వమట్లు ఇవి నేడభేద్యములుగావు. సంఘము, కులము, వేదములు మొదలైన వానిచే వృత్తులు మునుపటివలె సంపూర్ణముగ నిర్ణీతములౌట వర్తమానమున పొసగని మర్యాద.