పుట:Bhaarata arthashaastramu (1958).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము

సంశ్లేష విధానములు

సంశ్లేషమనగా కూడిక. ఇది పరిపరివిధమ్ములు. అందొక్కటిమాత్రం పూర్వము వివరింపబడియె. ప్రకృతము సంశ్లేషతత్త్వము నామూలాగ్రముగ బరిశీలింతము. ఈ విధానముల పరంపరయు జరిత్రమును నెయ్యవి యనిన:-

సంఘీభావ తత్త్వము

మనుష్యవర్గము సమూహముగా నేర్పడుటకు వారిస్వభావమే ముఖ్యకారణము. మఱియు, తేనెటీగలు, చీమలు మొదలైన జంతువుల నడవడింబట్టి చూడ సంఘీభావము వానికిని సామాన్యంబనుట విశదమగు. ఈ గుణంబేల యలవడియె?

ఏకాకిగానున్న భూతములకు సహాయంబు చాలమి శత్రువులచే వినాశంబు సిద్ధంబు. మఱియు నొంటరితన మెంతము దిరినను మృగములయందైనను స్త్రీ పురుష సమాగమంబు లేనిది వంశంబు నిలువదు. కావున ప్రాణసంరక్షణమునకు సంశ్రయంబు ప్రధానంబు.

జీవరాసులలో కామంబు సహజగుణంబు. కామముయొక్క ముఖ్యోద్దేశము జాతి ప్రాబల్యము. ఒక్క కామముదప్ప నింకెవ్వియు లేనిచో బిడ్డల గలిగింపగలముగాని కాపాడలేము. కావున కామముతోడ వాత్సల్యమును గలిసియుండును. పక్షులుసైతము పిల్లలు పెరుగుదాక వానిబోషించుటయందు సహజమైన యాదరముం బూనినవిగా నున్నవి. మానవజాతిలో నింకను విశేషించి యీ ప్రేమ కుటుంబము, వంశము, దేశము, ఇత్యాదులయందలి యనురాగముగా బరిణమించియున్నది. ఈ యనురాగము స్థిరమైయుంటకు నది యనవసితమై యుండుట ప్రాణావశ్యకమగుటయే కారణము.