పుట:Bhaarata arthashaastramu (1958).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమకును నధికారము గావలయుననికోరి, ప్రభులందులకుం దగిన చట్టములను సెలవియ్య మన్నందుచే గోపోద్దీపితులై వేఱుపడెదమని భయము జూపిరి. అప్పుడు ప్రభువులు వారింజూచి "మీతండ్రులు తాతలు మాకు విధేయులుగ నుండలేదా? మీరును నాతీరుననే కలకాల మేలయుండరు? పితృలకన్న మిన్నలైయుండ జూచుట మహాపాతకముగదా!" యని బూతువేదాంతముల నుపదేశించుట కుం బూనక "ఇంకను నెదిరించిన నేకదేశస్థు లొండొరులతో బ్రాణాంతముగబోరుట సంభవించును. అందుచే రాజ్యక్షయమును, తద్ద్వారా వీరు వారనక యెల్లరు ప్రాభవహీనులగుటయు దప్పదు" అని తలపోసి తమకు పదవి పోవుననుట నిస్సంశయమైన యుత్పాతమైనను, కొదువలేదని ప్రజల మతమునకు నంగీకరించి స్థానచ్యుతులైనను గీర్తిచ్యుతులుగాక మనిరి. కావున "ఇట్లుండరాదా? అట్లుండ రాదా" యను నవ్వుల కధలతో మనకేల? వర్తమాన భవిష్యత్తుల స్థితిగతుల మేరకు సర్వము చక్కబెట్టు కోవలయునే కాని భూత గ్రస్థులైయుండుట బుద్ధిలేని మతము.