పుట:Bhaarata arthashaastramu (1958).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహసము సున్నయైన సంపాదన ముండదుగాన రక్షణమెందుకొఱకు? ఈ గుణములకుండు పోలిక కంటికి దీపమునకు నుండునట్టిది. గ్రుడ్డివానికి దీపమనావశ్యకము. దీపములేకున్న కండ్లుండియు జూపువుండదు.

నూతన కల్పనలయందలి బాధ్యతకు 'పేటెంటు' హక్కులని పేరు. పేటెంటులంగూర్చిన చట్టదిట్టములు మనదేశములో దగినవిగా నుండనందున నవ్యపరిశోధనలకుం బరీక్షలకుం బాధకములు. సాహసం, ఉత్పత్తియు బేదవడియుండుట కిదియు నొక కారణము. త్వరలోనే సర్కారువారు వీనిని సంస్కరించి సర్వసమ్మతముం జేయజూతురనుటకు సూచనలు లేకపోలేదు.

పూర్వము చెప్పినమాట మీకు జ్ఞప్తికివచ్చినదో లేదోకాని యెత్తిచెప్పెద గమనింపుడు! ఆధునికమున నైరోపాది నాగరిక ఖండములలోనుండు నార్థికయుగంబు నిరామయంబుగాదనియు పరిశీర్ణక హేతు గర్భితమనియు వక్కాణించియుంటిమిగదా! ఆవిషయ మిపుడు విశదంబాయెగాబోలు! అనిరుద్ధ స్పర్ధ నవరుద్ధగజేయు కార్యము మనకన్నులయెదురనే కొనసాగింపబడుచున్నది. స్పర్ధ యమితమౌటచే పరిమితంబగుటకు దానే సాధనంబగుటయు, శిల్పశ్రేణులు, యజమానసమాజంబులు, సర్కారువారి యాజ్ఞ, ఇత్యాదులచే గ్రమక్రమంబుగ బద్ధంబగుటయు జూచుచున్నాము. ఆర్థిక వారిధి, స్థిరసౌఖ్య సమృద్ధులను అభిలాషలు తృప్తములౌటకై, కర్తృ కరణ సంఘంబులచే మధింపబడుచున్నది. ఇందు వేతనస్థితి వాసుకి, కూర్మము రాజ్యాంగము. మందరము కొండంతకోరిక. ఎయ్యైవిధానములు పుట్టనున్నవో తెలియ నెవరితరము? అమృతముమాత్రము పుట్టునో! ఒకవేళ విషముదప్ప నింకెవ్వియు వెలువడవో? సవిస్తరముగ విశదీకరింప నసాధ్యమైనను మొత్తంపుటర్థముగ గొన్నింటి నుడువనౌను. అవేవన, వర్తమానస్థితికి నిలుకడలేదు. అదిమాఱును. ఈ మార్పు మిక్కిలి మెల్లగా దిన్నగా వచ్చునుగాన చుఱుకు