పుట:Bhaarata arthashaastramu (1958).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అతిబాల్య వివాహములు, బిడ్డలుగా నుండునపుడే బిడ్డలగనుమర్యాద ఈకర్మభూమిలోనెకాని మఱెక్కడను లేదు. ఇది ఘోరమనియు వినాశకారియనియు నందఱును ఉపన్యాసము లిచ్చువారేకాని దానిని విడిచినవా రొకరునులేరు. మహమ్మదీయుల దౌర్జన్యమే యీ యాచారమునకు మూలకారణమని యనేకుల యభిప్రాయము. నాకీవ్యాజమునందు నమ్మకముతక్కువ. ఏలన, మనువునుదప్ప నింకెవరిని ప్రమాణముగా నంగీకరింపమని వాదాడుమనము మ్లేచ్ఛులవల్ల గలిగిన యీయాచారమును పాయకుండుట మనమతమునకు భిన్నతనముగాదా! రెండవది మనవారే కామమోహములు కానివందురు. ఆ కామమోహములకు సందులేకుండునట్లు పసికూనలకు బొమ్మలకు బోలె బెండ్లిజేసి వేదవాక్యముల నిలుపజూచిరో! ఏడేండ్ల బాలికా బాలకులకు గామమోహము లంతగానుండవు. కాబట్టి భవద్గీతా వాక్యప్రకారము వీరిపెండ్లి నిష్కామవ్యవహారముగాన సద్వ్రతమని యెంచిరో! ఈకారణముచేతనేమో పండుముదుసలికి లేతపడుచును దెచ్చికట్టుట? ఇదియును అప్పటికి నిష్కామ వ్యవహారమే. ఒకరికి కామము కాలకంఠుని సహాయము లేకున్నను గాలసహాయముచే గాలినది. ఇంకొకరికింకను మొలవనేలేదు. కావున భగవద్గీతలకు దత్కాలమునకు భద్రమే! మనసులేని పెండ్లి మృగకృత్యప్రాయమనుట యీ జనులకేనాటికి స్ఫురించదుగాబోలు! కామములేకయ సంతానఫలము బడయవలయునట! ఇది సాధారణముగ ముసలివారుచేయు నింద్రజాలమేయైనను, వయసువారిట్టి వ్యాసవరప్రసాదము నెన్నడునుగోరరు! "నిర్మోహత్వం నిశ్చలతత్త్వమ్" అన్నట్లు మోహములేక పడయబడిన సంతానమునకు జడత్వం బెప్పుడును దప్పదు. అట్టివారికి "జీవన్ముక్తి" యేగతి. ఈ దేశములో వరుడున్న తాతలు అవ్వలచేత వరింపబడినవాడనియేకాని కన్యకచే వరింపబడినవాడని యర్థముగాదు.