పుట:Bhaarata arthashaastramu (1958).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అతిసమీప సంబంధములు. రక్తసామ్యము ఎక్కువగాగల సంబంధములు శరీరమునకును బుద్ధికిని నుపాధికరములని జీవశాస్త్ర కోవిదులు సిద్ధాంతీకరించియున్నవారు. మఱియు దగ్గఱచుట్టరికమువల్ల ఏకరీతినే మర్యాదలు, చర్యలు, ఆలోచనలుగలవారు కలియుదురుగాన నూతనవిధ పరిచయమును తద్ద్వారాకలుగు వికాసమును మనకు లేకపోయె. చూడుడు! భోజనమునందుగల సూక్ష్మబుద్ధి మనవారి కింకెందును లేదుకాబోలు! జిహ్వకుమాత్రము వివిధరుచులు పాకములును గావలయు. బుద్ధికిని దక్కినవానికిని ఒకేరీతినుండు సామగ్రియే చాలును! అన్నకోశముమీది జ్ఞాపకము దేశముమీద లేదుగదా! ఇంగ్లీషువారన్ననో తమదేశములో నిచ్చవచ్చినచోట్ల బెండిలియాడుటయేగాక వర్ణసాదృశ్య మొకటియున్న నితరదేశములలోను వాలాయముగ బాంఢవ్యమొనరింతురు. (వర్ణమన్న శ్వేతవర్ణము గాని యజ్ఞోపవీత ధారణముగాదు) రక్తమును గుణగణమ్ములును ఇంచుక భిన్నములయ్యును పరస్పర లోపపూరణములై యున్న నావివాహము వివాహముగాని నూతనవిషయముల గ్రహింపను నివేదింపను జాలనివారి పొత్తు పొత్తుగాదు. ఇంచుమించు తమవలెనే యుండువారి సంగతి యప్రయోజనకారి. కావున గ్రొత్తసంబంధములు మొత్తముమీద సంఖ్యనుమాత్రమేగాక తేజోగుణమ్ములను వృద్ధినొందించునవి.

పూర్వికులకు ఇరుగుపొరుగిండ్ల పిల్లలను జూచుకొనుట విధిలేని కృత్యము. యానసౌకర్యము లేమిని, దేశమరాజకమై రక్షణములేని దగుటను దవ్వుల బెండ్లియాడుటయన్న, "నింటికి బిలుచుకొని వచ్చునంతలోన, మధ్యనెవరైన బెండ్లికూతు నెత్తుకపోవుదురో, యటయిన వృథాద్రవ్యనష్టముగదా" యని సంకోచించువారు ప్రాచీనులు. బ్రిటిష్‌వారి ప్రకృతరాజ్యములో నట్టి యిక్కట్టుల కెడము లేకున్నను మనజనులు తెగువలేనివారుగాన ప్రాతరీతులమించ నెంచకున్నారు. కారణములులేకున్నను గార్యములు వదలకుంటయేగదా మనలోని యద్భుతవిశేషము!