పుట:Bhaarata arthashaastramu (1958).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంతయు బ్రకాశితంబు జేయుచున్నవి. ఈలోకంబున సద్వర్తనమే పరలోకప్రాప్తికిని నాధార భూతంబనియు, అడవిలో చెట్టుక్రింద గూర్చొని, యేకాగ్రముగ ముక్కును బ్రహ్మను గండ్లనీరుగారునట్టు చూచుచుంట, స్వార్థపరాయణత్వముగాన నది యుక్తముగాదనియు, నాధునిక నీతిశాస్త్రజ్ఞులమతంబు. స్వకీయమునకన్న బరకీయ ప్రయోజనబుద్ధిమేలు. కారణమేమన మనయునికికి సంఘంబే ఏడుగడ. కొన్ని మతంబులు అహంకారము త్యాజ్యమనియు, అహంకారమేలేకున్న సంసారచక్రంబుదిరుగుట సాధ్యముగాదుగాన, స్వభావవిరుద్ధమును శుద్ధముగ నసాధ్యమునుఅగు వాంఛారహిత కర్మానుష్ఠానము కర్తవ్య మ్మనియు బరస్పరశత్రువులగు నీతుల బోధించును. ఈ మతంబుల మాటయెత్తిన మండిపడువారు కొందఱు "తనకు మించిన ధర్మమే లే"దని వాదింతురు. స్వాత్మపరత్వము పాపావహంబగుటయేగాదు. మఱి తన యుద్దేశమునకే ఊనమైననడువడి, అదెట్లన, స్వకీయసుఖమునే కామించువారు అనేకులున్న సంఘంబుచెడును. తమకు రక్షకమగు సంఘంబుజెడిన దామును నశింతురుగదా కావున అహంకారానహంకారములకు మధ్యవర్తియైన మార్గమున్నంగాని పురుషార్థ ప్రతిపాదనంబు దుర్ఘటంబు. అట్టిమార్గంబు లేకపోలేదు. దేశసంఘాభి మానులైనవారు కేవల పరోపకారబుద్ధితో కార్యారంభులైనను, తమచే దేశమున్నతికివచ్చిన, తద్వారా తామును క్షేమంబువడయుదురు గాన, నిట్టి కార్యములు సంకల్పమున నిరహంకారములును, ఫలసమయంబున స్వపరప్రయోజన ద్వంద్వ సంయుతములునుంగాన, సకలజన కరణీయంబులని ఆధునిక సిద్ధాంతము. సంఘమ్ములు జనులు పరస్పర ప్రయోజకములై యున్నవి. మహాభారతమున శ్రీకృష్ణుడు పాండవ ధార్తరాష్ట్రులంగూర్చి యుపమించిచెప్పిన -

      మ. "ధృతరాష్ట్రుండును బుత్రులున్ వనము, కుంతీనందనుల్ సింహముల్
           మతినూహింపనసింహమైన వనమున్ మర్ధింతురెందున్ వనా
           వృతవృత్తంబులుగాని సింహములకున్ వేగంబె చేటొందుగా
           నతెగన్‌బొందుట గార్యమీయుభమున్ సంతుష్టిమై నున్కికిన్."