పుట:Bhaarata arthashaastramu (1958).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెంతవేగమున నెదుగునో అంతవేగముగ నిట జనసంఖ్య ప్రసరింపలేదని చింతించువారు, ఎక్కువ ప్రజ నుద్ధరింపజాలు కళా విస్తీర్ణత యున్నదా కలుగునా యని యోచింపవలయును. జీవనాధారము లిప్పటియట్లనేయుండి ప్రజమాత్రము మిక్కుటమైన నష్టమేగాని లాభము గలుగదు. వణిగ్వ్యవహారము లనంతములుగ విజృంభించు సీమలో నెందరు పుట్టినను మేలేకాని భారముగా నుండదు.

సంకేత నామములు

త్రివిధ వృద్ధులును అధిక సమహీనంబులనియు అనులోమ యధాక్రమ విలోమంబులనియు పేర్కొనబడును.

భూజలాది ప్రకృతులనుండి వస్తువుల నుత్పత్తిజేయుట గ్రహించుట యిత్యాదులు కృషులనంబడును. సేద్యము లోహ మత్స్యాది గ్రహణము మొదలగునవి కృషులు. ఇందు వస్తుగ్రహణంబు ప్రధానంబు గావున 'ఆకర్షణ క్రియలు' 'పరికర్షణక్రియ' లనియుం జెప్పవచ్చును. ఇవి హీనవృద్ధి ననుసరించినవి.

అట్లు సంపాదించినవానిని అనేకవిధములుగ దయారుచేసి పక్వమునకు దెచ్చుట 'కళ' యనబడును. ఇందు రూపస్థలభేదంబులు ప్రధానంబులు గావున వీని 'పరివర్తన క్రియలు' అనవచ్చును. పరివర్తనమనగా వస్తువుల మార్పు.

ఇందుకు దృష్టాంతము. ప్రత్తి సేద్యమునకుం జేరినది. వస్త్రములు కళాసంబంధములు. ప్రత్తి హీనవృద్ధి ననుసరించును గాన ఎక్కువగా నుత్పత్తిచేసిన దానివెల యధికమగును వస్త్రములు. ఎక్కువగా నేయుకొలది వెలతగ్గును. కావున కళ లధికవృద్ధి ననుసరించును. కళకు వ్యవహారము పర్యాయపదముగా నెఱుగునది.

ఇది కర్మలు వ్యాపారము అని రెండు తెఱగులం బ్రవర్తిల్లు. కర్మ లనగా వస్తువులను జేయుపనులు. ఉదాహరణము శిల్పాదులు. వ్యాపారమనగా వాణిజ్యము వర్తకము. అనగా క్రయవిక్రయములు. వస్తువుల నొండొంటితో మార్చుట కొనుట యనుట.

కర్మలు హస్తకర్మలు యంత్రకర్మలు అని రెండువిధములు. వీనికింగల యంతరువు లికముందు విదితములగును.