పుట:Bhaarata arthashaastramu (1958).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికవృద్ధి న్యాయము

అధికవృద్ధి న్యాయంబు కృష్యాదులుతప్ప తక్కిన కళలయందు బ్రవర్తించును. ముఖ్యముగా యంత్రకళలలో దీనిప్రభావము తెల్లమగును. 1000 రూపాయలు ఇచ్చికొన్న యంత్రములో దినమునకు 10 తానులు గుడ్డ నేయబడునేని 2000 రూపాయలు మూలధనముగా నేర్పఱుపబడిన ఫ్యాక్టరీలో దినమునకు 30 - 40 తానులు నేయుట సుకరంబు. ఒకగుడ్డ నేయవలయునన్న రెండురూపాయ లగునను కొనుండు, 20 గుడ్డలు అదేచోట నేయవలయునన్న 40 రూపాయల కన్న దక్కువ పట్టుననుట అనుభవవిదితమేకదా! మొత్తముగా సరుకులనుదీసి యమ్మువాడు చిల్లరవ్యాపారము చేయువానికన్న నయముగానమ్మి లాభముబొందుట యందఱెఱిగిన విషయమే. కావుననే సీమగుడ్డ లంత సరసముగనుండుట. కోట్లకొలది మూలధనము వినియోగించిన కర్మశాలలలో నేయబడు మంచివస్త్రములు ప్రాచీనరీతిని చేతితో నేయబడిన మోటుగుడ్డలకన్న తక్కువ క్రయమునకు గొనవచ్చుననుట కిదియే తార్కాణము. ఉత్పత్తి యెక్కువ యగుకొలది ఈ కళలలో యధాక్రమమునకన్న న్యూనమైన శ్రమ వ్యయములు కావలసివచ్చును. అనగా శ్రమ యధికముచేసిన నంతకన్న ననులోమముగ ఫలితము హెచ్చును.

ఐరోపాలో జనసంఖ్య పెరుగుకొలది కళావాణిజ్యంబులును అధికముగ వ్యాపించుటంజేసియు, ఇందు లాభము అధికవృద్ధి రూపముగ వచ్చుటంబట్టియు మొత్తముమీద ప్రతివానికిని ఆదాయము ఎక్కువయై, ధాన్యమువెల హెచ్చినను సుభిక్షత సిద్ధింపజేయును. మనరాజ్యములో కృషులేకాని కళ లింకను ప్రాబల్యము గాంచలేదు. కావున జనసంఖ్య యెక్కువయైన ధాన్యాదులవెల హీనవృద్ధి న్యాయంబుచే హెచ్చును. ఈ లోపము నివారింపజాలు కళాప్రాబల్యమువలని యాదాయోద్దీపనంబు ఇంకను మనకు సమకూడలేదు. ఇంగ్లాండులో