పుట:Andhrula Charitramu Part 2.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడిన సత్యాశ్రయునకు దరువాతనే నన్నెచోడుడున్నవాడని నిస్సంశయముగా జెప్పవచ్చును. అమ్మరాజవిజయాదిత్యుడు క్రీ.శ.970వ సంవత్సరమువరకు బరిపాలించిన తరువాత నతని సవతియన్నయు రెండవ చాళుక్యభీముని జ్యేష్ఠపుత్త్రుడునగు దానార్ణవుడు 970వ సంవత్సరమున రాజ్యభారమును వహించి 973వరకు మూడు సంవత్సరములు రాజ్యపరిపాలనముచేసెను. తరువాత వేంగీదేశమరాజకమైనట్టు అనేక శాసనములవలన దెలియుచున్నది. దీనికి పూర్వచాళుక్య రాజకుటుంబములో సంభవించిన పరస్పర కలహములు గొంతవరకు గారణములుగానున్నను, వేరొక గొప్పకార ణముగూడ గానంబడుచున్నది. దక్షిణహిందూస్థానమునందు వేంగిరాజ్యమునకు బడమర రెండు శతాబ్దములనుండి వర్ధిల్లుచుండిన రాష్ట్రకూటసామ్రాజ్యము నిర్మూలము గావింపబడి మరల బశ్చిమచాళుక్య సామ్రాజ్యము నెలకొల్పబడియెను. రాష్ట్రకూటచక్రవర్తియైన రెండవ కర్కలుని జయించి, పశ్చిమచాళుక్య వంశమున జనించిన యొకానొక విక్రమాదిత్యుని కొడుకగు తైలపదేవుడు క్రీ.శ.973వ సంవత్సరమున సింహాసనమెక్కి, అదివరకు రాష్ట్రకూటచక్రవర్తులకు లోబడియుండిన మహామండలేశ్వరులయిన రాజులను వశపరచుకొనుటకు బ్రారంభించెను. ఆ కాలమునందు రాష్ట్రకూటులకు సామంతులుగనుండిన వైదంబులు, బాణులు, నలంబులు, చోడులు మొదలగువారాధిపత్యములక తమలో దాము పోరాడుచు, గొందరు శములను విడిచి వేంగీదేశములోని దక్షిణభూములాక్రమించుకొనసాగిరి. మహాబలివంశమునందు జనించిన అగ్గపరాజను బాణుడు అన్నగూరి అగస్తేశ్వర భట్టారకునకు పదియవ శతాబ్ద మధ్యమున భూదానము చేసినటుల దెలిపెడి శాసనమొకటి కమ్మనాటిలోని పొదిలి సీమలో జేరిన సన్నమూరు గ్రామమున గన్పట్టుటచేత నా ప్రాంతము బాణులస్వాధీనమాయెనని యూహింపవచ్చును. ఆ శాసనమునందాతడు పరివీపురాధిపతియని చెప్పబడినది. రాయవేలూరునకు దక్షిణభాగమునందుండు 'పడైవీడు' అనునదే పరివీపురమని కొందరిచే నిర్ధారింపబడినది. ఈ బాణరాజులు మొదట గాంగపల్లవులకును;