పుట:Andhrula Charitramu Part 2.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈతనికి గవిబ్రహ్మయగు తిక్కనసోమయాజి మంత్రిగ నాస్థానకవిగనుండి తన నిర్వచనోత్తరరామాయణము నంకితముచేసియుండుటచేత, ఇతనికీర్తి యాంధ్రప్రపంచమున నాటుకొని శాశ్వతమై నిలిచియున్నది. ఇతడు విక్రమసింహపురము రాజధానిగ బాకనాటిని బరిపాలించెను. ఇతడు క్రీస్తుశకము పదమూడవ శతాబ్ద మధ్యముననున్నవాడు.

బ్రాహ్మణులకు వెలమలకు వివాదము.

పూర్వము ముక్కంటికాడువెట్టియను పల్లవరాజు శ్రీశైలమునకు దూర్పున నుండు దేశమున డెబ్బదియగ్రహారములను గల్పించి బ్రాహ్మణులకు దానముచేసియుండెను. అధిరాజేంద్రచోళ మండల మనియెడు పశ్చిమపాకనాటిలోని పేరంగండూరు గ్రామము వానిలో నొక్కటిగానుండెను.ఈ గ్రామము నేబదిరెండు భాగములుగా విభాగించి ముక్కంటికాడు వెట్టి బ్రాహ్మణులకు దానము చేసియుండెను. అప్పటినుండియు నా బ్రాహ్మణులు పుత్త్రపౌత్త్ర పారంపర్యము నిరాటంకముగా ననుభవించుచుండిరి. ఇట్లుండ సకలికోడూరులోనుండు వ్యవసాయదారులు తమ దేశమునందు గొప్ప కలహము జనించుట చేత తమ దేశమును విడిచి వలసవచ్చి, ఈ గ్రామములోని చెరువునకు ఉత్తరభాగమున వసతులేర్పరుచుకొని నివసించుచుండిరి. మరియు ఇనంబ్రోలు గ్రామవాసులయిన వెలమలు కొందరు తమ గ్రామమున మహామారిజ్వరమంకురించి ప్రజానాశనము గలిగించుచుండుట చేత నా గ్రామమును విడిచి ఈ బ్రాహ్మణాగ్రహారముకు జనుదెంచి తామాక్రమించుకొనెడు పొలములో నెంత పంట పండునో యంత మొత్తమును పన్నుగా జెల్లించుపద్ధతిపై నొడంబడిక చేసికొని గుడిసెలు కట్టుకుని కాపురముండుచువచ్చిరి. తరువాత మీనరాశియందు శనిప్రవేశించుటచేత దేశమున గాటకము సంభవించెను. ఆ కారణముచేత బ్రాహ్మణులు గ్రామమును విడిచిపెట్టిపోయిరి. కాటకము వదలిపోయిన తరువాత మరికొంత కాలమునకు బ్రాహ్మణులు మరల స్వగ్రామమునకు వచ్చిరి. వెలమలు తమ యొడంబడిక ప్రకారము బ్రాహ్మణులకు కట్టుబడి చెల్లింపరైరి. ఇంతియగాక యా యగ్రహారము పరిపాలనము చేయునట్టి