పుట:Andhrula Charitramu Part-1.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనకు సామంతుడగు పవార రాజకుమారుడగు వజ్జయిని కోరికను మన్నించి యీ చాళుక్య భీమవిష్ణువర్ధనుడు అభరాద్వసుకాల్మాడి గ్రామనివాసియు, రేవశర్మ పౌత్రుడును, దేవి యార్యపుత్రుడును క్రమపాఠియునగు కొమ్మన యను బ్రాహ్మణునకు నుత్తరాయన పుణ్యకాలమున కాండేరువాటి విషయములోని కొడహతల్లి గ్రామమును దానము చేసినట్లుగ బెజవాడ తాలూకాలోని కోలవెన్ను గ్రామములో దొరకిన శాసనమునుబట్టి దెలియుచున్నది.[1]

అమ్మరాజ విజయాదిత్యుడు.

(క్రీ,శ. 945 మొదలుకొని 970 వఱకు.)

అమ్మరాజులలో రెండవవాడును విజయాదిత్యులలో నాఱవవాడునునైన యితడు లోకమహాదేవివలన రెండవ చాళుక్యభీమునికి జనించిన చిన్న కొడుకు. వీనికి సమస్తభువనాశ్రయుడనియు, మహారాజాధిరాజనియు, రాజమహేంద్రుడనియు, పరమ భట్టారకుడనియు బిరుదునామములు గలవు. రాజముద్రికలపై శ్రీ త్రిభువనాంకుశ అని చిత్రింపబడియుండెను. ఇతడు సింహాసనమెక్కుటకు ముందు యుద్ధమల్లునితో గొంత పెనగులాడినట్లు సూచనలు గన్పట్టుచున్నవి గాని యితడు సింహాసనమధిష్ఠించిన పిమ్మట నైదవ విజయాదిత్యుని కాలమునుండి తటస్థమగుచుండిన కుటుంబకలహములు నిలిచిపోయినట్లుగ గన్పట్టుచున్నవి. పడకలూరు శాసనమున నితడు శాలివాహనశకము 897వ సంవత్సరము మార్గశిర బహుళత్రయోదశి శుక్రవారము నాడనగా క్రీస్తుశకము 945వ సంవత్సరము డిసెంబరు నెల5 వతేదీని పట్టాభిషిక్తుడయినట్టు చెప్పబడియన్నది. వీనిపేరిటి శాసనములనేకములు గలవు.

(1) పెన్నత వాడి విషయములోని పడంకలూరు (పడకలూరు) గ్రామములో గొంతభూమిని చంద్రగ్రహణ కాలమున దానము చేసెను. ఈశాసన రచనము మాధవభట్టుచే గూర్పబడి జొంటాచార్యునిచేత లిఖితమైనది. ఈ శాసనమునందే అమ్మరాజ విజయాదిత్యుడు పట్టాభిషిక్తుడయిన తేది తెలుపబడినది.

  1. South Indian Inscriptions, Vol, I, p. 4.4.