పుట:Andhrula Charitramu Part-1.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియొకరుకారు. వీరల నెల్లరను ఆంధ్రులని చెప్పుటకే యొప్పును. కాబట్టి శివస్కంధవర్మ యాంధ్రపల్లవ శాఖలోని వాడని చెప్పవచ్చును. ఎనిమిదవ ప్రకరణమున శివస్కందవర్మను గూర్చి వ్రాయుచు నీ యభిప్రాయమునే దెలిపియుంటిమి. అతడే యితడైన యెడల నందుదుదహరింపబడిన కాలము సరియైనదిగా దలంపరాదు. ఇతడు మూడవశతాబ్ద మధ్యమముననో మూడవ శతాబ్దముననోయుండునని నిశ్చయముగా జెప్పవచ్చును.

శివస్కందవర్మ పరిపాలనము.

శాతవాహన వంశరాజులలో గడపటివాడయిన మూడవపులమాయికి బిమ్మట ధాన్యకటకము రాజధానిగ జేసికొని యాంధ్రదేశమును బరిపాలించుచుండిన మూలవంశము నిర్మూలముకాగా గృష్ణానది కుత్తరభాగమున నిక్ష్వాకులును, వాయవ్య భాగము నాభీరులును, పశ్చిమభాగమున రాష్ట్రకూటులును, నైరుతిభాగమున విష్ణుదత్తులును, పూర్వదక్షిణ భాగములను పల్లవులు నాక్రమిచుకొనిరి. ఈశాన్య భాగమనగా కృష్ణామండలమును కళింగమును సాలంకాయన గోత్రులైన పల్లవులాక్రమించుకొనిరి. మూడవశతాబ్దాంతమునందు నాంధ్రదేశముకంతకు బల్లవులధిపతులయి యుండిరని చెప్పుటకు లేశమాత్రము సందియము లేదు. శివశర్మవర్మ రాజాధిరాజని చెప్పబడియుండుటచేత ఆకాలమునం దతడే మిక్కిలి పరాక్రమవంతుడని యూహింపదగి యున్నది. ఇంతియగాక యశ్వమేధయాగము గూడా జేసినట్లుగా జెప్పబడియుండుటచేత నిశ్చయముగా నీతడు బహుపరాక్రమవంతుడై రాజాధిరాజై యుండినగాని యట్టికార్యమును నిర్వహింపజాలడు. ఇతడు కాంచీపురము నుండి శాసనములను బ్రకటించి నట్లు గన్పట్టుచున్నదిగాని కాంచీపురము రాజధానిగా నుండెనో లేదో శాసనములంబట్టి దెలియరాదు. అయిన నితడు కాంచీపురమును రాజధానిగ జేసికొనినని చెప్పిన చెప్పవచ్చును. రాజ్యపరిపాలనము నందు మంత్రులును, మంత్రాలోచన సభ్యులునితనికి తోడ్పడుచుండిరి. ఇతడు సామంతులైన రాజకుమారులచే బరివేష్టింపబడి యుండెను.వీని