పుట:Andhraveerulupar025903mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యవన సైన్యమును జెండాడి పరిశీలింప రాజు కనబడ డయ్యెను. దురదృష్టవశమున నాంధ్రులు పరాధీనులై యవనపాలనమున నున్న నిజనగరము చేరిరి. ఆంధ్రదేశ మద్వితీయవిక్రమముతో బాలించి ఆంధ్రజాతికి శరణ్యుడైన ప్రతాపరుద్రుడు 1323 లో బంధీకృతుడయ్యెను. ప్రతాపరుద్రుడు జీవగ్రాహిగ బట్టువడినందులకు డిల్లీనవాబు ఆఱుమాసము లుత్సవము జరిపెనట. డిల్లీ నవాబు దయదలచి విడిచిపెట్ట ప్రతాపరుద్రుడు కాళేశ్వరమునకు వచ్చి యట గొంతకాల ముండి మరణించినటుల స్థానికచరిత్రము చెప్పుచున్నది ఆంధ్రసామ్రాజ్యమునకు ముఖ్యస్థానమగు ఓరుగల్లు పూర్వవిభవమంతయు ప్రతాపరుద్రుడు బంధీకృతు డగుటతో దీరిపోయెను. నాటి సామ్రాజ్య చిహ్నము లనదగు శిలాద్వారములు, కూపములు, ఆలయములు, దుర్గద్వారములు, క్రీడాసరోవరములు స్మరణ చిహ్నములవలె నేటికి జరిత్రాభిరతుల సంతాపాశ్రుసేచన ముతో దృప్తినొందుచు ఓరుగల్లుకోటలో గనుపించుచున్నవి. ఆంధ్రసోదరులారా! హతశేషములగు చిహ్నముల గాంచియేని యానందింపరా ?


_______