పుట:Andhraveerulupar025903mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టయు ధర్మ సంస్థాపనార్థము వీరు లాత్మార్పణము గావించుటయు యాచశూరుని చరిత్రమువలన దెలియును. అంతటితో ఆంధ్రుల స్వాతంత్ర్య వికాసము కడబట్టి చిన్న చిన్న జమీనులతో దృప్తిపడవలసి వచ్చినది. మొగలు రాజ్యములలో నొకటగు గోలకొండ రాజ్యమునందు మంత్రులుగ నుండి ఆర్షధర్మములను యవనులు ద్రోహము గావింపకుండ జెల్లెలి కట్టవలె నడుపడి మంత్రిపదవిని నామమాత్రముగా నుంచుకొని ఆంధ్రదేశము నేక హేలగా బాలించిన యక్కన్న మాదన్నలనాడు మఱల నాంధ్ర వికాసము తలయెత్తినది. దురాగతులగు రాజద్రోహులచే మిగుల ఘోరముగా అక్కన్న మాదన్న లేనాడు గోలకొండ రాజవీధిలో జంప బడిరో ఆంధ్రజాతీయ పతనము దర్శింపజాలక యాత్మ రక్తముతో నాంధ్రమాత పదము లభిషేకించి యేనాడు అక్కన్న మాదన్నలు త్యాగము ప్రకటించిరో యానాటితో నాంధ్రులు చరిత్రశరణ్యులై పూర్వ వికాసము నంతయు గోలుపోయిరనియు నాటినుండి స్వతంత్ర రాజ్యస్థాపకుడగు వీరుడు జనింప లేదనియు నెఱుంగనగును.

ఈవిధముగా గ్రీస్తుశకము పూర్వము నుండి పదునెనిమిదవ శతాబ్దము వఱకు గల సంగ్రహచరిత్ర యీగ్రంథమున నిముడ్పబడెను. ప్రకాశకు నీ పొత్తములు ఆంధ్రవీర రత్నావళి అనుటకంటె ఆంధ్రవీరు లనుట యుక్తమని పేరు మార్చుటలో స్వతంత్రించిరి. ఈ చిన్ని పుస్తకము ఆంధ్రుల హృదయమున నాంధ్రప్రతిభను ద్యోతకము చేయునేని ధన్యులము. గ్రంథము గ్రాంథికభాషలో జరిత్రానుకూలముగ వ్రాసితిమని పాఠకులకు విన్న వించుచున్నారము.

ఇట్లు భాషాసేవకులు

శేషాద్రి రమణకవులు.

శతావథానులు

నందిగామ

29-4-1927


_______