పుట:Andhraveerulupar025903mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నలగామరాజు పెద్దవాడై గురిజాలరాజ్యము తాను స్వయముగా బాలింప దొడగెను. సోదరు లతని పోషణముక్రింద నే యుండిరి. వీరవిద్యాదేవియందు జనించిన పెదమల దేనాదులు మిక్కిలి చిన్నవారు. వీరి కేమేని యాపదకలిగింతురేమో యని బ్రహ్మనాయ డీబాలురను వెంటగొని మాచర్ల రాజధానిగ జేసికొని కొంత దేశమును బాలించుచుండెను. బ్రహ్మ నాయకుడు పేరునకు మంత్రియైనను రాజ్యవ్యవహారములు స్వయముగ నిర్వహించుచు పెదమల్లదేవాదుల వేయి కనులతో గాపాడుచు వారిసుఖము తన సుఖముగ భావించుచుండెను. బ్రహ్మనాయకుని సత్పరిపాలనమునకు బ్రజలుమెచ్చి పలనాటికృష్ణుడని యతనిని బ్రశంసించుచుండిరి. గురిజాల రాజ్యము స్వతంత్రముగ నలగామరాజు తక్కినసోదరుల నందఱ జెంతనుంచుకొని పాలించుచుండెను. నాగాంబయను నొకరెడ్డి కాంత నలగామాదుల దననేర్పుచే లోగొని గురిజాలరాజ్యమునకు మంత్రిణియై రాజ్యతంత్రములు నిర్వహించుచుండెను. ఈ యమనె నాయకురాలందురు. నాయకురాలు మంత్రిణిగ జేరినది మొదలు బ్రహ్మనాయకుని ద్వేషింపసాగెను. రెండు రాజ్యములవారు ఒకరినొకరు ద్వేషించుకొనుచుండిరి. నాయకురాలు దు సంత్రము లొనర్చి మాచర్లరాజ్యము నాశనము చేసి గురిజాల రాజ్యములో గలుప నెన్నియో ప్రయత్నములు గావించుచుండెను. బ్రహ్మనాయకుడు తన మెలకువచే నా చిక్కులు తొలగించుచు కాలము గడపుచుండెను.