పుట:Andhraveerulupar025903mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథ వాడుకలో నున్నది. అందు సత్యమెంతయున్నను వినుటకు మాత్రము యుక్తియుక్తముగ నున్నది.

మాదన్నమంత్రి దానకర్ణుడై యహోరాత్రములు లేదనకుండ దనగృహమున బ్రాహ్మణజనమునకు సత్రము బెట్టుచుండువాడట. ఆసత్రములో జిరకాలమునుండి యక్కన్న భుజించుచు గాలక్షేపము చేయుచుండెను. అక్కన్నగారు సత్రమువారందఱితో గూడ దాను మాదన్నగారికి సోదరుడనని చెప్పువాడు. రానురాను సత్రమువారెకాక మాదన్నగారి భార్యసైతము గౌరవముగా నక్కన్నగారిని దిలకించుచు భోజనాదికములలో శ్రద్ధవహించుచుండెను. ఒకనాడు మాదన్నగారి భార్య భర్తతో మంతనము నాడుచు "మీసహోదరుడు చాలకాలమునుండి సత్రములో భుజించుచు దిక్కుమాలిన వానివలెనుండ జూచుచుండెదరేమి? సంస్థానములో నుద్యోగము నిప్పింపరాదా!" యని ప్రశ్నించెను. మాదన్న నివ్వెఱపోయి "సోదరు డెవరు నేనెఱుగనే!" యనెను. అంత నాతని ధర్మపత్ని "మనసత్రములో భుజించుచున్న యక్కన్నగారు మీసహోదరుడని నేనాతనిముఖమునకా వినియున్నాను. మీరెఱుగనటుల భాషింతురేల?" యనెను. మాదన్న ఆశ్చర్యపడి వెంటనే పరిచారకునిచే నక్కన్నగారిని పిలిపించి యుచితాసనము జూపించి కూర్చుండ జేసి "మిత్రమా? నీవెవ్వడవు నీనివాసమెద్ది? నీకు నాకుగల బాంధవ్యమే