పుట:Andhraveerulupar025903mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రరాజులచే బరిపాలింపబడి యాంధ్రకవితకు నాటపట్టై శాశ్వతస్థాయిగా నాంధ్రచరిత్రములకు నాదర్శప్రాయముగా నుండదగు విద్యానగర సామ్రాజ్యముతో బాటుగా నాంధ్రుల యదృష్టముగూడ నంతరించెను.

రామరాజు భట్టుమూర్తిని గౌరవించి పెక్కు కావ్యములంకితము నొందెను. రాయలవారు సాధింపజాలని తురుష్క రాజ్యములను సాధించెను. ఆంధ్రుల పరాక్రమమునకు బ్రాణభిక్షపెట్టి యాంధ్రులు పరాధీనత గాంచకమున్నె యంతరించెను. తురుష్కుల దండయాత్రలచే నాంధ్రసామ్రాజ్యములు రెండును నశించెను. మొదటిది కాకతీయ సామ్రాజ్యము, రెండవది విద్యానగర సామ్రాజ్యము. ఈ యుభయ రాజన్యులు ఆంధ్రజాతీయతా సంరక్షణార్థము జనించిరి. జాతీయత నుద్ధరించి కృతార్థులైరి. దేశీయుల దురదృష్టవశమున వారు గడించిన యౌన్నత్యము భాగ్యభోగ్యములు, ఐశ్వర్యజీవనము వారితోడనే కాలగర్భమ నం దదృశ్యమయ్యెను. వీరారాధనమను నాచారముగల యాంధ్రకుమారులు రామరాజు దివ్యనామము మఱునకుందురేని కృతార్థులు కాకపోరు.

రామరాజు మరణించిన దినము క్రీ.శ. 1565 సం. జనవరి 23 వ తేది మంగళవారమని చరిత్రగారులు నిర్ణయించినారు. ఆదినమె యాంధ్రవికాసమున కంత్యదినము. నాడె ప్రళయ కాలాంబుదము లావరించి విజయనగర సామ్రాజ్యమును రూపుమాపెను.

_______