పుట:Andhra bhasha charitramu part 1.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందును తుమున్నర్థక రూపములే కలవు. కాని దీర్ఘము కలుగలేదు. 'తెకతేర' కూడ నిట్టి తుమున్నర్థకరూపములు గలదే.

(ఋ) చేతావాతా (కానివాడు), ముడ్డీనోటా (వాగుతాడు) - ఇట్టి వానియందు విశేష్యపదముల విభక్త్యంత రూపములు కానవచ్చుచున్నవి.

(ౠ) ఆదరాబాదరా - మొదలగునవి యన్యదేశ్యములు.

(ఎ) అకటావికటం, అతలాకుతలం, తాటాతూటం మొదలగు వానియందు మొదటి పదమునకుమాత్రము దీర్ఘము కలిగినది.

(ఏ) జాదురజాదురంబు, అనుదానిలో దీర్ఘము కలుగలేదు.

(ఐ) ఇంచుమించు, కల్లబొల్లి, కొకిబికి, గుడిగుడి, కంచుమించు - వీనిలోని పదములకు వికారము కలుగలేదు.

(ఒ) 'అడ్డ (-డ్డా) దిడ్డి' లో మొదటి పదము తుదియచ్చునకు దీర్ఘము వైకల్పికముగా కలుగును.

(ఓ) అయిటయిటికి, చీటికిమాటికి, మాటిమాటికి మొదలగునవి విశేష్యపదముల విభక్త్యంతరూపములు. చూ. (ఋ) వీనిలో మొదటిపదము మీది విభక్తిప్రత్యయము వైకల్పికముగా లోపించును.

(ఔ) రమారమి, సగటునుమారు, సరాసరి - మున్నగునవి యన్యదేశ్యములు.

(14) అయ్యేదీలేదు, పొయ్యేదీలేదు; ఉయ్యాలా, జంపాలా; ఊరా? పేరా? -పెట్టనా? పొయ్యనా? -పెట్టాలా? పొయ్యాలా? - లోపల లొటారము, బయట బటారము; విచ్చలవిడి, రామారాజ్యం; - ఇట్టివానిలో నాయా పదములు కలిసియే ప్రయోగింపబడును.

(15) పులిమీదపుట్ర, ఎముకలమీద బొమికలు - మొదలగు నానుడులనుగూడ నీ సందర్భమున స్మరింపవచ్చును.

(16) ఈ క్రింది ద్వంద్వసమాసములందు రెండవపదములు కేవల మూతగా నుపయోగింపబడినవి. ఇట్టి వనేకములు గలవు. కొన్నిమాత్ర ముదాహరింపబడుచున్నవి:-

అగ్గీబుగ్గీ, అంటూసొంటూ, అడాపొడా, అడుగూమడుగూ, అడ్డం దిడ్డం, అడ్డదిడ్డం, అడ్డాదిడ్డి, అందంచందం, అద్దాబద్దా, అసలూకొసలూ, అన్నెంపున్నెం, అప్పూసప్పూ, అరమరా అభ్యంతరం; అఱాగొఱా (అఱగొఱ), అల్లంబెల్లం, ఆకూఅలమూ, ఆటాపాటా, ఆరూపోరూ, ఆలగోడు