పుట:Andhra bhasha charitramu part 1.pdf/843

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండుపదముల స్వరూపమును మఱుగుపడినవి.

ఎద్దడి(?) = దారిద్ర్యము, శూన్యము; చిలువాయనము = చిల్లర, క్షుద్రము; చిలు = చిఱు? నరగజము = నరగ = నగారా ('అల్గోజా' వలె 'నర్గోజా' కూడ నొక వాద్యవిశేషము; ఇది హిందూస్థానీపదము; 'సర్గోజా' తెనుగున 'నరగజము' అయినది; వానికి నర, గజ, పదములతో సంబంధము లేదు; పాణివడము = అమ్ములపొది; పానవట్టము = పానము + వట్టము, అని శ. ర. లోని వ్యుత్పత్తి దుర్గ్రాహ్యము; 'ప్రాణప్రతిష్ఠ(ము)' అగునా? = ప్రా. పాణవయట్టమ్ = తె. పానవట్టము; పారుపత్తెము = సం. పరభృత్యము; వడుసుడి = రాజులకిచ్చుదండువు, విడిముడి = ధనము; సయ్యొద్ద = సహితార్థ? - సింగోట (ఇందు పూర్వపదము 'శృంగ' శబ్దభవము; రెండవదాని వ్యుత్పత్తి తెలియదు); సీవిరి = సం. చామరీ?

ఈ రీతిగా తెనుగున నర్థము విడవలసిన యనేక సమాసములు గలవు. వాని వ్యుత్పత్తులను దెలుపుటకు జాల పరిశోధనము కావలెను. ఈ క్రింద నాలుగయిదు పదములకు మాత్రము వ్యుత్పత్తి విచారముచేసి యీ ప్రకరణమును ముగింపవలసి యున్నది.

1. కవ్వడి.

చిన్నయసూరి 'కవ్వడి' అను పదమును సమాసముగా గ్రహించి, దానిని నిక్కలాదులలో జేర్చి, యథాప్రయోగముగ గ్రాహ్యమన్నాడు. ప్రౌడవ్యాకరణకారు డీప్రశంస నెత్తుకొనకపోయినను తన శబ్దరత్నాకరమున నా పదమును 'కవ + వడి'గా విడదీసి రెండుచేతుల వడిగలవాడని యర్థము చెప్పినాడు. ఆధునిక లాక్షణికులందఱును నాపదము నట్లే విడదీసినారు. ఇట్లు వా రాపదమును విడదీయుట కర్జునునికి సంస్కృతమున 'సవ్యసాచి' యను నామముండుటచే కారణముగ గనబడుచున్నది. 'సవ్యసాచి' యను పదమునకు 'ఎడమచేతివాడిగలవాడు' అని యర్థమగును గాని 'రెండుచేతుల వాడిగలవాడు' అను నర్థము పొసంగదు. ఎడమచేతి వాడి గలిగినను కుడిచేతికిగూడ వాడి లేకుండకపోదు; కాని రెండుచేతులకును సమానమగు వాడి యుండుట యసంభవము. అర్జునుడును "భండనమున నిరుగేలను గాండీవము దివియ నేర్పు గలిగిన నం దుద్దండమగు సవ్యకరము ప్రచండత బరగుదును సవ్యసాచి యనంగన్" అని చెప్పికొన్నట్లు విరాటపర్వము IV. 145 పద్యమున నున్నది. ఎడమచేతివాడివానిరంతయో కొంతయో కుడిచేతితో గూడ బనిచేయగలరు. అందుచేతనే యర్జునుడు కవదొసలను ధరించి యుద్ధముచేసినట్లు వర్ణింపబడినాడు.