పుట:Andhra bhasha charitramu part 1.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోగృష్టి, గోధేనువు, గోవశ, గోవేహత్తు, గోబష్కయణి, కఠప్రవక్త, కఠశ్రోత్రియుడు, కఠాధ్యాపకుడు; కఠధూర్తుడు (ఇచట ధూర్త శబ్దమునకు నిందార్థము లేదు, నేర్పరి యని యర్థము).

(16) జాతివాచక పదములు ప్రశంసావాచక పదములతో సమసించును: ఈ ప్రశంసావాచక పదములు రూడి పదములుగా నుండవలెను; అనగా నితర లింగములందున్న పదములతో వీనిని జేర్చినను వీని లింగము మాఱగూడదు. ఉదా. గోప్రకాండము, గోమతల్లిక, గోమచర్చిక, గవోద్ధము, గోతల్లజము. ఇట్టి ప్రశంసావాచక పదములు సాధారణముగ సమాసములందు పరపదములుగానే యుండును.

ప్రశంసార్థముగల ప్రశస్త, శోభన, రమణీయ మొదలగు పదములును, ప్రత్యేక ప్రశస్తిని దెలుపు శుచి, పటు, మొదలగు పదములును మతల్లికాది పదములతో జేరవు. జాతివాచక పదములు సమసించు ననుటచేత 'కుమారీ మతల్లిక' అను సమాసము కలుగదు.

(17) 'యువా' శబ్దము 'ఖలతి, పలిత, వలిన, జరతి' అను పదములతో సమసించును: ఉదా. యువఖలతి (యౌవనములో బట్టతల గలవాడు - గలస్రీ); యువపలితుడు, పలిత (యౌవనములో వెండ్రుకలు నెరసినవాడు - నెరసినస్త్రీ); యువవలినుడు, వలిన (యౌవనమున శరీరము ముడుతలు పడినవాడు - పడినస్త్రీ); యువజరుడు, జరతి (చిన్న తనములో ముసలితనము గలిగినట్లు కనబడినవాడు - కనబడుస్త్రీ).

(18) కృత్య ప్రత్యయాంత పదములును, తుల్యార్థక పదములును జాతివాచకములు కాని పదములతో సమసించును: ఉదా. భోజ్యోష్ణము = తినుటకు యోగ్యమయిన వేడి గలది; తుల్యశ్వేతము = సమానమగు తెలుపు గలది; అట్లే, సదృశశ్వేతము మొదలయినవి.

(19) వర్ణ (= రంగు) వాచకపదము వర్ణవాచక పదముతో సమసించును: ఉదా. కృష్ణసారంగము. ఇచట కృష్ణ, సారంగ పదములు రెండును, వర్ణ వాచకములు. సారంగ మనగా చిత్రవర్ణము, కృష్ణసారంగ మనగా నల్లని మచ్చలు గలది, లేడి మొదలయినవి.

(20) కర్మధారయ సమాసమున 'కడార' మొదలగు పదములు వైకల్పికముగా పూర్వపదము లగును; ఉదా. కడార జైమిని, జైమిని కడారుడు; గడులశాండిల్యుడు, శాండిల్య గడులుడు మొదలైనవి. కడార, గడుల, ఖరజ, ఖాడ, కాణ, కుంఠ, ఖలతి, గౌర, వృక్ష, భిక్షుక, పింగ, పింగల, తమ, జతర; బధిర, మఠర, కుంజ, బర్బర - ఇవి కడారాదులు. నౌ, కాక, అన్న,