పుట:Adhunikarajyanga025633mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిరి పోలండు, యూగోస్లావియా దేశములందును, బల్గేరియా యందును, ప్రజాస్వామికమును రక్షించుటకై ప్రజలు తగు ప్రయత్నము చేయకున్నారు.

ప్రజాస్వామిక రాజ్యాంగము కల్పధేనువు కాదు. చక్రాయుధమునుకాదు. రౌతుకొద్ది గుఱ్ఱమనునట్లు అయ్యదియు ప్రజల ప్రతిభావిశేషముల ననుసరించియే, సుఫలితములగాని, దుష్పలితములగాని ప్రసాదించును. బాలకుని హస్తమందలి ఆయుధమువలె, నిరర్ధకులగుప్రజలమధ్య ప్రజాస్వామిక రాజ్యాంగము స్వవినాశనకరము కావచ్చును. మహావీరుని యొరయందలి నిశితకరవాలముభంగి నయ్యది, విజ్ఞానులును సమర్థులును సంఘసేవానిరతులునగు, స్వార్ధత్యాగపరుల వశమందున్న, కామధేనువువలె కోరినకోర్కెలనెల్ల నీడేర్చును. ఏకచ్ఛత్రాధిపత్యమువలన యేదోషములు జాతికి ఆపాదితమగునో, వానినే యనుభవించుటకు బ్రజలు ప్రయత్నించుచో ప్రజాస్వామికము వమ్ముకాకమానునా? అల్పసంఖ్యాకుల యసహన, యసాంఘికపాలనమునే ప్రజలు ప్రేమించుచో, ప్రజాస్వామికము ఖిన్నత నొందదా? పాలనుపిండుటకు మారు రక్తమును పిండుటకే పట్టుదలవహించు ప్రజలకు ప్రజాస్వామికమను కామధేనువు జీవనాధారమగు అమృతవృష్టిని ప్రసాదించకలదా?