పుట:Abaddhala veta revised.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాను యాడ్లర్ కు నాయకత్వం అప్పగిస్తే తన సూత్రాలకు భిన్నంగా పోతాడా అని ఫ్రాయిడ్ ఆగ్రహించాడు.వియన్నా సంఘసభ్యులు చెప్పగా అతడిని తొలగించినట్లు పేర్కొన్నాడు. అలాగే యూంగ్ కు ప్రధాన పదవి కట్టబెట్టినట్లు రాశాడు.

మొదటి ప్రపంచ యుద్ధంలో తన సైకో ఎనాలసిస్ ప్రకారం నరాల జబ్బుకు చికిత్స సఫలమైందని, వైద్య సైనిక రంగాలలో యిది నిజమని ఫ్రాయిడ్ ప్రచారం చేసి నమ్మించాడు.మొదటి ప్రపంచ యుద్ధంలో సైకో ఎనాలసిస్ సఫలమౌతుండగా, ఇంతలో యుద్ధం ముగిసిందని ఫ్రాయిడ్ బాధపడ్డాడు. 1918 సెప్టెంబరు 28,29లో బుడాపెస్ట్ లో జరిగిన సైకో ఎనాలసిస్ 5వ అంతర్జాతీయ సమావేశాలకు యుద్ధంలో పాల్గొన్న సైనికాధిపతులు సైతం అనేక మంది వచ్చారు. 2 లక్షల 50 వేల డాలర్లు ఒకతను చందా యిచ్చాడు. ఫ్రాయిడ్ కు అక్కడ వీరారాధన లభించింది. తన జీవిత కృషి సఫలమైందని ఫ్రాయిడ్ సంతోషించాడు.

థామస్ సాజ్ ప్రకారం ఫ్రాయిడ్ పద ప్రయోగంతో ఆకర్షించే గొప్ప వ్యక్తి. సైకో థెరపి అనేది చికిత్స కాదు. మాట్లాడడం అందులో ముఖ్యవిధానం. అచేతన రీతుల వలన మనిషి ప్రవర్తన వుంటుందని,ఇది వక్రరీతులలో సాగుతుంటుందని ఫ్రాయిడ్ ఉద్దేశం.

మానవుడు స్వేచ్చాపరుడు కాదనీ అతడికి స్వేచ్ఛగా ఆలోచించే ఇచ్ఛ లేదనీ ఫ్రాయిడ్ మూలసూత్రం. ఇందుకు అనేక ఆధారాలు చూపే ప్రయత్నం అతడు చేశాడు. ది సైకో పాధాలజీ ఆఫ్ ఎవ్విరిడే లైఫ్ అనే పుస్తకం రాశాడు. తాను గొప్ప శాస్త్రజ్ఞుడనని చాటడానికి ఫ్రాయిడ్ ప్రయత్నించాడే గాని, మానవుడి మనస్సు ఎలా పనిచేస్తుందో చూపలేదు. చేతన అచేతన ఉద్దేశాలను గమనిస్తే, మనం యాంత్రికంగా తీసుకునే నిర్ణయాలన్నీ కావాలని చేస్తున్నట్లనిపించదన్నాడు. అచేతనం నుండి యీ ఉద్దేశాలు వస్తుండగా, నిర్ధారణ అనేది స్పష్టపడుతున్నదన్నమాట. నియతి విధానం మానసిక రీతిలోనే గాక, నేర న్యాయంలో కూడా వున్నదని ఫ్రాయిడ్ రాశాడు.

లియొనార్డో డ వించిని ఉదాహరణగా స్వీకరించిన ఫ్రాయిడ్ తన నియతివాదాన్ని అన్వయించి చెప్పాడు. లియొనార్డో నెమ్మదిగా పనిచేయడం ఒక లక్షణంగా కనిపిస్తున్నదన్నాడు. ఫ్రెస్కో చిత్రాలు వెయ్యాలంటే త్వరగా పనిచేయాలి. తడి ఆరకముందే చిత్రం పుర్తిగావాలి. అందుకే నెమ్మదిగా చిత్రం వేసే రీతిలో లియొనార్డో ఆయిల్ చిత్రాలు వేశాడని ఫ్రాయిడ్ అన్నాడు. లియొనార్డోపై విరుచుకుపడ్డ ఫ్రాయిడ్ ఒక ఉదాహరణ యిస్తు, చిన్నతనంలో ఒక డేగ వచ్చి తోకతో లియొనార్డొ మూతిపై కొట్టిందట. ఆ విషయం ప్రస్తావిస్తూ లియొనార్డొను స్వలింగ సంపర్కం కోరిన, ఆచరించిన వాడుగా చిత్రించాడు.(Homo Sexual) అసలు చిక్కు ఏమంటే ఇటలీ భాషలో గాలిపటం అనే మాటను జర్మనీలో డేగ అని అనువదించడం వలన యీ గందరగోళం ఏర్పడింది. ఇది గమనించకుండా ఫ్రాయిడ్ రాసింది వేదాక్షరంగా సైకో ఎనాలసిస్