పుట:Abaddhala veta revised.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయాన్ని గ్రహించిన ఫ్రాయిడ్ తన సైకో ఎనాలసిస్ భావాల్ని వ్యాపింపజేయడానికి తీవ్ర స్థాయిలో ఉద్యమించాడు.

అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సమితి:

వ్యాపార రంగంలో కొత్తగా వచ్చిన సరకు అమ్మడానికి వినియోగించే పద్ధతులన్నీ ఫ్రాయిడ్ ప్రయోగించి సఫలుడయ్యాడు. సైకో ఎనాలసిస్ ఉద్యమంలో ఎక్కువగా యూదులు ఉన్నారు. యూదుల పట్ల వ్యతిరేకత,జుగుప్స వున్నదన్న సత్యం అతడికి తెలుసు. యాడ్లర్, కార్ల్ అబ్రహం, ఎల్.హెచ్. స్టెకల్, ఫెరెంజి వంటి సైకో ఎనాలసిస్ ప్రముఖులంతా ఫ్రాయిడ్ అనుచరులేగాక,యూదులు కూడా. పైగా సెక్స్ గురించి మాట్టాడటం కూడా సమాజంలో కొంత వ్యతిరేకతను కలిగిస్తుంది.కనుక జనాకర్షణ పద్దతులు అవలంబించడానికి గాను, యూదు కాని ప్రసిద్ధుడిని సైకో ఎనాలసిస్ సమితి అధ్యక్షుడుగా ప్రతిపాదించాడు. యూదులు ఇందుకు వ్యతిరేకత చూపగా, వారికి నచ్చజెప్పి, యూంగ్ కు జాతి విద్వేషం వున్నా తన కోసం వదులుకోడానికి సిద్ధపడ్డాడని యూదు వ్యతిరేకత మానేసి తనతో స్నేహంగా వుండడానికి ఒప్పుకున్నాడని ఫ్రాయిడ్ తన తోటి యూదులకు చెప్పాడు. వియన్నా స్టెకల్ హోటల్ లో యూదులకు యిలా నచ్చచెప్పిన అనంతరం, కార్ల్ యూంగ్ అధ్యక్షుడయ్యాడు. ఆ విధంగా అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సంఘం పుట్టగా దీనికి అనేక శాఖలు ఏర్పడ్డాయి.

యూంగ్, యాడ్లర్ లు రానురాను ఫ్రాయిడ్ కు భిన్నంగా సైకో ఎనాలసిస్ సూత్రాలు తమ పద్ధతిలో పెంపొందించారు. ఫ్రాయిడ్ కు యిది సుతరామూ నచ్చలేదు. తాను సూచించిన మూలసూత్రాలను అనుసరిస్తేనె సైకో ఎనాలసిస్ అని ఫ్రాయిడ్ పట్టుబట్టాడు. ఇంచుమించు పేటెంట్ హక్కుగా సైకో ఎనాలసిస్ పై ఫ్రాయిడ్ తన అజమాయిషీ కావాలనుకున్నాడు. కారున్ హర్నె, హారీస్టాక్ సల్లివన్, ఎరిక్ ఫ్రాం ల మధ్య ఫ్రాయిడ్ అనంతరం ఇంచుమించు యిలాంటి పేటెంట్ హక్కు తగాదా, సైకోఎనాలసిస్ గురించి సాగింది. శాస్త్రీయ పరిధిలో యిది విడ్డూరమే!

ఫ్రాయిడ్ కూ యాడ్లర్ కూ సైకో ఎనాలసిస్ తగాదా కేవలం మూలసూత్రాలకే పరిమితమైతే అర్థం చేసుకోవచ్చు. కీర్తి దాహం, ధనసంపాదనలో యీ తగాదా రావడం విచారకరం. తన సూత్రాలను మాత్రమే సైకో ఎనాలసిస్ అనాలని, ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకోననీ ఫ్రాయిడ్ పట్టుబట్టాడు.

యాడ్లర్ మానవ ప్రవర్తన గురించి సిద్ధాంతీకరించాడనీ, నరాల జబ్బుకు పరిమితం కాలేదని ఫ్రాయిడ్ 1914లో విమర్శించాడు. అప్పటికి వియన్నా సైకో ఎనాలసిస్ సొసైటి అధ్యక్షుడుగా యాడ్లర్ ను రాజీనామా పెట్టేటట్లు తెరవెనుక వత్తిడి చేశాడు. కాంగ్రెసు పార్టీపై గాంధీజీ పెత్తనం ఎలా వుండేదో, సైకో ఎనాలసిస్ సంఘాలపై ఫ్రాయిడ్ మాట అలా చెల్లింది.