పుట:Aananda-Mathamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

ఆనందమఠము


బియ్యము, పప్పు, ఉప్పు, దుడ్డు, చీర, ఱవికె మొదలగువాని నొసంగిరి. ఆవైష్ణవి శిబిరము యొక్క స్థితినంతయు జక్కఁగాఁ జూచికొని వెడలెను. అప్పుడు సిపాయీలు 'మరల నెప్పుడు వచ్చెదవు?' అని యడిగిరి. వైష్ణవి 'చెప్పలేను, నేనుండుట.చాలదూర' మనియెను, ఎంతదూర మని యడుగఁగా 'పదచిహ్నమున నున్న దాన' ననియెను. ఆదినము మేజరు ఎడ్వర్ డ్సు దొర పదచిహ్న గ్రామవిషయమై కొన్ని సంగతులను విచారించుచుండెను. ఇది యొక సిపాయికిఁ దెలిసి యుండెనుగాన, ఆవైష్ణవిని కేష్ట౯ చెంతకుఁ బిలిచికొని పోయెను. కేష్ట౯ దొర ఎడ్వర్ డ్సు దొరయొద్దకుఁ దోడ్కొని పోయెను. ఆవైష్ణవి మధురమైన హసన్ముఖముతో మర్మ భేది యగు కటాక్షము నిగుడించి ఎడ్వర్ డ్సుదొర తల తిరుగునట్లు చేసెను. చేత నున్న సారంగమును మీటుచు మాళవరాగమున రూపక తాళగతితో

" మ్లేచ్ఛనివహ నిధనే కలయసి కరవాలమ్” అని పాడెను.

ఎడ్వర్ డ్సు—— నీ యిల్లెక్కడ బీబీ !

బీబీ——నేను బీబినికాను, వైష్ణవిని. నాయిల్లు పదచిహ్న మునం దున్నది.

ఎడ్వ—— Well, that is Padsin——Padsin is it ? అచ్చట నొక గర ఉన్నదా?

వైష్ణ——ఘర్ (ఇల్లు)? ఎన్నియో యున్నవి.

ఎడ్వ——గర్ కాదు, గర్ కాదు, గర్ కాదు.

వైష్ణ—— నీమనసులోనిమాట తెలిసెను. కోటయా?

ఎడ్వ—— ఎస్, ఎస్, కోటు ! కోటు ! ఉన్నదా ?

వైష్ణ——కోట యున్నది. పెద్దకోట.