పుట:Aananda-Mathamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఆనందమఠము


వ్రాలిరి. అయినను, ఎవ్వరును పాడుటను నిల్పక “జయజగదీశ హరే! ' యని పాడుచునే యుండిరి. గానము ముగియగనే యంతయు నొకేసారి నిస్తబ్ద మాయెను. ఆదట్ట మగు నడవియును ఆ నదీసైకతమును ఆ యనంతమగు విజనమును ఒకేసారి గంభీరమైన నీరవమున నివిష్ట మాయెను. కేవల మాయతి భయంకరమైన ఫిరంగిగుండ్ల ధ్వనియును, దూరముగా నుండి వచ్చుచుండిన యాంగ్లేయుల అస్త్రముల ఝంకారధ్వనియును వారిపదధ్వనియును మాత్రము వినఁబడుచుండెను.

సత్యానందుఁ డాగంభీరమైన నిశ్శబ్దమధ్యమునం దత్యుచ్చస్వరముతో 'జగదీశుఁడగుహరి మీకుఁ గ్రుపచేయును. ఫిరంగు లెంతదూరమున నున్నవి,' అనియెను.

మీఁదుగ నుండి యొక్కఁడు, ఈకాననమునకు సమీపమున నున్నది. ముందు కనఁబడు కొండయే యడ్డ' మనెను.

సత్యానంద—— నీ వెవరు?

పై నుండి—— నేను నవీనానందుఁడను.

సత్యానంద——మీరు పది వేలసంతాను లున్నారుకదా, మీకు జయ మగును, ఫిరంగులను లాగుకొని రండు

అపుడు అశ్వారూఢుఁడై మొదట యుండిన జీవానందుఁడు "రండు" అని యఱచెను.

అంత ఆళ్వారూఢులును పదాతు లందఱును అతిత్వరితంబుగ జీవానందుని వెన్నంటి చనిరి. పదాతులు భుజమున తుపాకులను, నడుమున కత్తులను, చేతియందు బల్లెములను ధరించి కాననము నుండి బయటికి రాగానే, ఆ యజస్ర మగు గుండ్లవర్షము గురిసి వారిని చిన్న భిన్నము చేయ నారంభించెను.