పుట:2015.373190.Athma-Charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. వైష్ణవ క్రైస్తవమతములు 51

మును ముకుళింపఁజేసె ననియు, నేను వగచితిని. ఆజన్మము మనోవాక్కర్మలందు పవిత్రత ననుభవించినను, గత యేప్రిలు మధ్యకాలము నుండి నేను దుశ్చింతల పాలైతి నని నే మొఱపెట్టి, లజ్జావిరహితమగు నా హృదయమును భగవంతుని హస్తగతము చేయుచు, శీఘ్రమే తనసన్ని ధానమున నన్నుఁ జేర్చుకొనుఁ డని నేను దేవుని ప్రార్థించితిని !

1889 వ సంవత్సరము జనవరి మొదటితేదీదినచర్య బైబిలునందలి "ప్రభువుప్రార్థనము"తో ప్రారంభ మయ్యెను. ఆసంవత్సరము మేనెల మొదటితేదీనికూడ ప్రభువుప్రార్థన పూర్తిగ లిఖింపఁబడెను. నాదుశ్చింతల నరికట్టు మని దేవుని వేడుకొనుట అప్పుడప్పుడు కానవచ్చుచున్నది. మే 15 వ తేదీని ప్రార్థన మిటు లున్నది : - "దయామయా ! నీతనయులము అవివేకమున పాపకృత్యములకుఁ గడంగుచున్నాము. కాన నీవు మావర్తనము గాపాడి, కరుణాళు వగు జనకుని వలె మాతప్పులు సైరింపవలయును." ఈ మేనెలనుండి నవంబరువఱకును వరుసగ ప్రతి యాంగ్లేయమాసారంభ దినచర్యము ప్రభువుప్రార్థనముతో ప్రారంభమగుచుండెను. అప్పుడప్పు డొకానొకదినమున నిటులే యాప్రార్థన ముల్లేఖిత మగుచుండెను.

జూలై 18 వ తేదీని, దసరాసందర్భమున వ్రాయఁబడిన ప్రార్థనము లిచట వివరింపవలసియున్నది : - "పరమపితా ! నీయెడ నాకుఁగల గాఢానురాగము అనిర్వచనీయము. ఈ దుర్బలునికి నీమృదు కరస్పర్శసుఖ మొకింత యొసంగుము ***ద్రోహకౌటిల్యములు ప్రబలిన యీలోకమున నెట్టిసజ్జనుఁడును సైతానుప్రేరణమునకు లోనగుచున్నాఁడు. పావనచరితా, నాహృదయము బలవత్తరమగు దృఢ దుస్సంకల్పముల కిరవు గాకున్నను, ఒక్కొకతఱిని, అసూయ గర్వము