పుట:2015.373190.Athma-Charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 34

ల్యలక్షణము లని వైద్యులు చెప్పెడివారు. నాయీడునఁ దాను నిట్టిబాధలకు లోనైతి నని మాయమ్మ చెప్పెడి మాటలు, నా కోదార్పుగలిగించుటకు మాఱుగ, మఱింత భీతిని బెంచుచుండెను ! స్వాభావికముగనే నేను దుర్బలశరీరుఁడను. ఆసమయమున నాకుఁ గొంచెము శరీరాస్వస్థత యేర్పడెననుట సత్యము. కాని, మాటి మాటికి నేను మననము చేయుచుండుటచేతను, చెలికాండ్రు సదా స్ఫురింపఁజేయు చుండుట వలనను, నా నీరసము గోరంతలు కొండంత లయ్యెను ! కావున, తగిన జాగ్రతతో నౌషధసేవ చేయక వ్యాధిని ముదురఁబెట్టినచో, నాకును మిత్రులు రామయ్య ముఖ్యప్రాణుల గతియే నిజముగఁ గలుగు నని నమ్మి నేను భీతిల్లితిని.

ఇట్లు భయమున వెతనొందెడి నాచికిత్సకై 1887 వ సంవత్సరమున మాతండ్రి పడిన శ్రమకు మేఱ లేదు. రాజమహేంద్రవరమునఁగల వైద్యశిఖామణులయొద్దకు నన్నాయన కొనిపోయి, నా చేయి చూపించి, యాలోచన లడుగుచుండువాఁడు. నానిమిత్త మాయన గ్రహింపని కూరగాయవైద్యములు, తెలిసికొనని 'గోసాయిచిటికలు'ను లే వని చెప్పవచ్చును. ఐన నేను సేవించిన యౌషధముల వలన నా కించుకంతయు లాభము సమకూరదయ్యెను.

ఎట్టకేలకు కళాశాలయందు మొదటివత్సరము గడచిపోయెను. సంవత్సరపరీక్షలో ప్రథమస్థానమున నుత్తీర్ణ మగుట యేవిద్యార్థికైన హర్ష దాయకముగ నుండును గాని, నామనస్సు నది మఱింత విచారతోయముల ముంచివై చెను ! నా యీకడపటి విజయమే కడపటి విజయముగఁ బరిణమించు నేమోగదా ! ఇపుడైన నేను మృత్యు ముఖమునుండి తప్పించుకొనుటకై యారోగ్యాన్వేషణము చేయవలదా ? నామిత్రుఁడు వెంకటరావు ప్రవేశపరీక్షలో నపజయము గాంచి,