పుట:2015.373190.Athma-Charitramu.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహావలోకనము 621

నాకుఁ గలిగిన నిరసనము నానాట తొలఁగిపోయి, అందలి యుత్కృష్టాదర్శములు హృద్యము లయ్యెను. భగవంతునిప్రాఁపున సంసారయాత్రయందు ధన్యులు కాఁగోరువారు, నామరూపముల విషయమై లేనిపోని దురభిమానములకు లోనుగాక, సర్వమతధర్మములును సాధనములుగఁ జేకొని సత్యము గ్రహింపవచ్చు నని నేను దలంచితిని.

ఇఱువదవ సంవత్సరమందువలెనే యఱువది దాటినప్పుడును, సంఘసంస్కరణము నా కభిమతవిషయమె. ఐనను, సంస్కరణాశయములు సాధనప్రణాళికలును కాలానుసారముగ మార్పులు చెందవలె ననియె నానమ్మిక. సాధ్యమగునంతవఱకు, ఉదారజాతీయాదర్శములకును సాంప్రదాయములకును ననుగుణ్యములగు పద్ధతులె సంస్కర్త యవలంబించుట యుక్తమని నాకు నచ్చెను. స్త్రీ పునర్వివాహము మొదటినుండియు నాయభిమానసంస్కరణము. కాని, యిందలి ప్రణాళికలో స్వతస్సిద్ధమగు కష్టములు కొన్నిగలవు. వధూవరుల శీలప్రవర్తనములు మునుముందుగఁ గనిపెట్టు టసులభముకాదు. పెండ్లికాయితమయిన స్త్రీ పురుషుల పూర్వోత్తరములు యోగ్యతాయోగ్యతలును సమగ్రముగఁ దెలిసికొనక, ఒకరిగుణము లొకరు గ్రహింప వారికిఁ దగు నవకాశము లొసంగక, వేగిరపాటున సంస్కర్తలు వారికి వివాహబంధ మొనఁగూర్చుటవలన, మన దేశమునందు పలుచోట్ల నీ సంస్కరణమున కపయశస్సును, వధూవరుల కసౌఖ్యమును బాటిల్లుచున్నవి. ఇట్టి లోపములు నివారించినయెడల, దేశాభ్యుదయమున కావశ్యకమయిన వితంతూద్వాహసంస్కరణము జనసమ్మత మగును. సామాన్య వివాహములవలెనే వితంతూద్వాహములును స్వగృహమున వధూవరుల