పుట:2015.373190.Athma-Charitramu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. నెల్లూరు గాలివాన 579

స్వతంత్రకథలె. ఒకటి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలోను, మిగిలినవి భారతి, దీనబంధు, పుష్కరిణి, కృష్ణా పత్రికలలోను, ఇదివఱకె ప్రచురింపఁబడెను. ఇదివఱకు నేను హాస్యరసకల్పనతో కథా రచనము చేయలేదు. ఈ పుస్తకములోని 'గణేశను', 'బ్రహ్మానందము' నను కథలు హాస్యరసయుతములు. ఈ విషయమై నా ప్రయత్న మెంతవఱకు సఫలమయ్యెనో చదువరులె నిర్ణయింపఁగలరు. 'గోపాలము', 'రావి యారాటము', 'బిళ్ల గన్నెరుపూవు' లలో కరుణారసమె ప్రథానము. 'బ్రహ్మానందము', 'దేవయ్యశోధన' లలో ప్రకృతమున మనదేశమును గలంచెడి బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యను జిత్రించితిని. హిందూ ముస్లిము సమ్మేళనమును సూచించునది 'మంతాజముత్యము' కాకినాడ యందలి దేశీయ మహాసభ మిషగాఁ గొని యల్లిన ప్రేమకథ 'పార్వతి యనుతాపము'. కేవలము స్వవినోదమునకె కల్పించుకొనిన చిన్నికథ 'కాళ్యాణి'.

మొదటి భాగమునందలి కథల వలెనే యివియును వేఱు వేఱు లక్షణములు దాల్చియున్నవి. 'బిళ్ల గన్నెరుపూవు' క్రొత్తరకపు విషాద కథ యని కొందఱు మిత్రుల మతము. 'పులికూన' తుదిని సూచితమైన దండకవిలెను దనకుఁ జూపెదరాయని యొకనాఁ డొక క్రొత్తమనుజుఁడు నెల్లూరులో మాయింటికి వచ్చి యడిగెను ! ఇట్టి కోరికనె తెలియఁ బఱుచుచు నా మిత్రులు రా. పా. గిడిగు రామమూర్తి పంతులుగారు నాకొక లేఖ వ్రాసిరి ! కథా చమత్కృతిచే చదువరులను మోసగించుటయె రచయిత ముఖ్యోద్దేశము గావున, "మిమ్మును మోసగించిన నా గెలుపునకు సంతసించితినని" స్నేహితులు రామమూర్తిగారికి నేను బ్రత్యుత్తర మిచ్చితిని.