పుట:2015.373190.Athma-Charitramu.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 578

నేజదివి, వ్రాసినశుద్ధప్రతులను నేను దిద్దుకొనుచు మిత్రులకుఁజూపి దిద్దించుచు, ఇట్లు కథ నునుపుదేఱువఱకును దానిని సవరించుచునే యుండెడివాఁడను. చిన్నకథకైన నేనిట్లు పెద్దపాటుపడుచుండువాఁడను. రచయితను వానిమిత్రులనే రంజింపఁజేయనేరని రచనము, పత్రికలలోఁ బ్రచురమై, రచ్చకెక్కి, బాధ్యతారహితులగు పాఠకుల తలల కెటు లెక్కఁగలదు ? పత్రికలోఁగాని పుస్తకరూపమునఁగాని ప్రచురమగు రచనము నాసొంతసొత్తు కాదనియు, జనరంజకమగు భాషతోను భావములతోను విలసిల్లవలెననియు నామతము. పెద్దలకుఁ జిన్నలకు, విద్యావంతులకు విద్యారహితులకు నందఱకును హృద్యమగు కథాసంవిధానమునఁ జెలంగి, పెటుకు పేలవములుగాని లలితపదములతోఁ గూర్చిన కథయె కథయని యెంచువాఁడను. వాడుకభాష యనియును, గ్రంథస్థభాషయనియును భేదములు భాషపట్ల నంతగఁ గలిపించుకొనువాఁడను కాను. కాని, పలికెడిపలుకుకంటె వ్రాసెడి వ్రాఁత చిరస్థాయి గావున, అద్దాని యాకారమును జిత్రించువిషయమున రచయిత తగిన జాగరూకత వహింపవలెను. వ్యాకరణ సూత్రము లుల్లంఘించుటయు, శ్రుతి కటుప్రయోగము చేయుటయు వ్రాయసకానియందు పెద్దలోపములు. మన జీవిత పద్ధతివలన లోకమందలి నైతికస్థితికిని, మనరచనవలన భాషానైర్మల్యమునకును గళంక నూ పాదిల్లకుండ మెలంగుట మానవధర్మమని నేను విశ్వసించువాఁడను. ఈ ప్రణాళిక ననుసరించియె నే నెప్పుడును రచనమునకుఁ దొడంగువాఁడను. నా నియమములకు వ్యాఘాతము గలుగకుండ నాకు సాయ మొసంగిన మిత్రబృందమునకు నే నెపుడును కృతజ్ఞుఁడను.

1927 వ సంవత్సరారంభమున నా "చిత్రకథామంజరి" రెండవ భాగము మద్రాసున ముద్రిత మయ్యెను. వీనిలోని వన్నియు