పుట:2015.373190.Athma-Charitramu.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. కలకత్తానివాసము 495

వచ్చుటకు సంకల్పించుకొనిరి. వారిస్థానమున ప్రకృతిశాస్త్రోపన్యాసకులగు స్ట్రాకుదొరగా రధ్యక్షులయిరి. కళాశాల తరగతులకు ఊలుదొరయు, నేనును ఆంగ్లసాహిత్యమును బోధించువారము. ఆయన పరదేశమున నుండుకాలమున నింగ్లీషునకు నన్ను ప్రధానోపన్యాసకునిగఁ జేయుదు రనుకొంటిని. అట్లుగాక, యీ యుద్యోగమునకు దాత్కాలికముగ నొక క్రొత్తదొరను గొనివచ్చెదరని నాకుఁ దెలిసెను. ఆంగ్ల సాహిత్యబోధనమున నాకెంత యనుభవ నైపుణ్యము లున్నను, యమ్. యే. పరీక్షలో నేను జయమందినఁగాని వృత్తివిషయమున నాకిఁక నభివృద్ధి గలుగదని గ్రహించి, యాపరీక్షకు దీక్షతోఁ జదువ నుద్యుక్తుఁడ నయితిని. పూర్వము విజయనగరమున నాకు శిష్యుఁడును ఇపుడు కొంతకాలమునుండి యీ గుంటూరు కళాశాలలో బోధకుఁడునునైన భమిడిపాటి బంగారయ్య, తానును, తన స్నేహితుఁడగు మండవిల్లి సత్యనారాయణయును, 1913 జూలైనుండి కలకత్తా పోయి, అచట యమ్. యె. పరీక్షకుఁ జదువ నుద్దేశించితిమని చెప్పి, నన్ను కలకత్తా కాహ్వానించిరి. బి. యె. పరీక్షనిచ్చినప్పటినుండియు నేను యమ్. యె. పరీక్షకుఁ బోవ వాంఛించియె యుంటిని. కాని బోధనాకార్యనిమగ్నుఁడ నైయుండినపు డాపెద్దపరీక్షకుఁ జదివి, యందు విజయము గాంచుట దుస్సాధ్య మని తోఁచెను. కావున, నా మిత్రులును, ప్రస్తుతమున కాకినాడకళాశాలలో నుపన్యాసకులునగు శ్రీ వేమూరి రామకృష్ణారావుగారివలెనే నేనును రెండు సంవత్సరములు కళాశాలలో సెలవు పుచ్చుకొని కలకత్తా పోయి, అచటి యే కళాశాలలోనైనఁ జదివినచో, నేనును బరీక్షలో నుత్తీర్ణుఁడనై, ఉద్యోగవిషయమున మంచిలాభము నొందఁగలనని యనుకొంటిని. ఆసంవత్సరము వేసవి సెలవులకు ముందుగ కలకత్తాలో విద్య ముగించు