పుట:2015.373190.Athma-Charitramu.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 494

మనమేనల్లుడు నన్నువదలనేలేదు ! నాతో నర్సాపురం వచ్చెదనన్నాడు - పాపము వానితల్లి గుంటూరునుండి తిరిగి యెపుడో అట్లపాడు వచ్చునను ఆశపెట్టి, యింటిలోనివారు వానిని మరిపించుచుండిరి....వాడును వాని తమ్ముడును మనతోనుండి, విద్యాబుద్ధులు నేర్చి, ముందు మన కానందము కలుగజేతురను ఆశతో నుంటిమి ! చిన్న పిల్లవాడు క్షేమమా ? -

రా. కృష్ణమూర్తి"

13. కలకత్తానివాసము

"గుంటూరు విద్యావిషయక ప్రదర్శనము" 1911 జనవరి నెలలోనె పూర్తియయ్యెను గాని, దాని సంబంధమగు పనులెన్నియో యింకొకసంవత్సరమువఱకును సాగుచునే యుండెను. ప్రదర్శనమున కనుపఁబడిన వస్తువు లెవరివి వారికిఁ బంపవలసివచ్చెను. లెక్కలన్నియు సరిచూపించి, నివేదికవ్రాసి, యచ్చొత్తించవలసి వచ్చెను. ఈలోపుగ కార్యదర్శులలో నిద్దఱు గుంటూరునుండి వెడలి పోవుటచేత, కార్యభార మంతయు నాశిరముననే పడెను. ఆ పనులన్నియు నేను సమగ్రముగ నెఱవేర్చి, తుది బహిరంగసభను జరిపించి, ఈయవలసినవారికి బహుమతు లిప్పించి, కార్యనిర్వాహకసంఘమువారి యనుమతి ననుసరించి మిగిలినసొమ్మును, కాకితములును పాఠశాలా పరీక్షాధికారి కార్యస్థానమున కంపివేసితిని.

1913 వ సంవత్సరారంభమున గుంటూరుకళాశాలోపాధ్యాయులలోఁ గొన్ని మార్పులు గలిగెను. అదివఱ కేండ్లనుండి విరామ మెఱుఁగక పనిచేసిన డాక్టరు ఊలుదొరగారు అమెరికాపోయి