పుట:2015.373190.Athma-Charitramu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 268

ఈ యిద్దఱు మిత్రులు నేనును గలసి మృత్యుంజయరావును మఱునాఁడు చూచి వచ్చితిమి. అతని కిపుడు వ్యాధి ప్రబలియుండెను. సాయంకాలము వీరేశలింగముగారినిఁ జూచివచ్చితిమి. స్నేహితు లంత నరసాపురము వెడలిపోయిరి.

రాజమంద్రిలో నున్న రోజులలో నేను మా నాయనతోను, పెద్దతమ్మునితోను కుటుంబఋణముల తీరుమానమును గుఱించి మాటాడితిని. మిత్రుఁడు రామమూర్తి తాను బూర్తిచేయవలసిన బి. యే. పరీక్షకుఁ జదువుటకై రాజమంద్రి యిపుడు వచ్చెను కాని, యాయన చదువు చాలించుకొని కొలఁదిదినములలోనే స్వగ్రామ మగు నేలూరు వెడలిపోయెను. పాపము, మృత్యుంజయరావున కంత్యదినములు సమీపించుచుండెను. ఇపు డాతఁడు తీవ్రజ్వరపీడితుఁ డయ్యెను. ఆతని స్థితినిగూర్చి మిగుల వగచితిని. ఇట్టి నిరపరాధి నేల వేధించెద వని దేవదేవుని సంప్రశ్నించితిని. మానవులు మొఱపెట్టక, తమ విధికృత్యములు నెరవేర్చు చుండుటయే కర్తవ్యముకదా !

వ్యాధిగ్రస్తుఁడగు మృత్యుంజయరావు సెలవు పొడిగించుఁ డని మెట్కాపుదొర నడుగుటకై, పాపయ్యగారు నేనును ఆ క్రిస్మసుదినములలో దొరగారిని సందర్శించితిమి. మృత్యుంజయరావునకు సెలవిచ్చెదమని దొరగారు ధైర్యము చెప్పిరి.

29 వ తేదీని నేను కోటిలింగక్షేత్రమున కేగి, యీమధ్య చనిపోయిన స్నేహితుఁడు రంగనాయకులునాయఁడుగారి సమాధిచూచి వచ్చితిని. కాలగతి నొందిన మిత్రుఁడగు నాయఁడుగారిని గుఱించి విచారమందితిని. నెచ్చెలుని సుగుణగుణవర్ణనము చేయుచు నొక పద్యమాల రచింప నూహించితిని. ఒకటిరెండు రోజులలో పరీక్ష