పుట:2015.373190.Athma-Charitramu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. సహవాసులు 267

నాయఁడుగారికి నే నంత ననంతముగారి పరిచయము గలుగఁజేసితిని. నాయఁడుగారు వారి యింట భోజనము చేసి, మేము కుదిర్చిన పడవలో నేలూరు వెళ్లిరి. మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు సన్నిపాతజ్వరము వాతఁబడి మరణించిరని కొలది రోజులలోనే మాకుఁ దెలిసెను. ఆ దు:ఖవార్త విని నేను మిక్కిలి విలపించితిని. అక్టోబరు 10 వ తేదీని నారాయణస్వామినాయఁడుగారు తనసోదరిని, తమ్ముని పిల్లలను, రాజమంద్రినుండి తీసికొనివచ్చిరి. పిల్లలందఱు మాయింట భోజనము చేసిరి. క్రైస్తవులగు నాయఁడుగారు వారి సోదరియును అనంతముగారి యతిథులైరి. ఆ సాయంత్రము వారందఱును మద్రాసు రెయిలెక్కి పోయిరి.

13 వ అక్టోబరున మా బకింగుహాముపేట పఠనాలయ వార్షికోత్సవము జరిగెను. మిత్రుఁడు రామమూర్తి యాతరుణమున చక్కని యుపన్యాస మొసంగినను, రామారావుగారు దానిమీఁది వికటవ్యాఖ్యానములతోఁ దమ యధ్యక్షోపన్యాసమును ముగించిరి !

"శీలము" అను పేరితో నేనొక దీర్ఘోపన్యాసము వ్రాసి, 11 వ నవంబరు సోమవారము జరిగిన "విద్యార్థిసాహితీసమాజ" వార్షికసభలోఁ జదివితిని.

డిసెంబరు 8 వ తేదీని నేను స్నేహితులకొఱకు రెయిలుస్టేషనులో కనిపెట్టుకొని యుంటిని. మద్రాసునుండి వీరేశలింగముపంతులు గారు వచ్చి, వెంటనే రాజమంద్రి వెడలిపోయిరి. కాని, మిత్రులు కనకరాజు, గంగరాజుగార్లు ఆరోజున మాయింట నిలిచియుండిరి. శీతకాలపు సెలవులకు పాఠశాల మూయఁబడుట చేత, డిసెంబరు 9 వ తేదీని సతీపతు లిరువురమును స్నేహితులతో బెజవాడనుండి బయలుదేఱి రాజమంద్రి వెడలిపోయితిమి.