పుట:2015.373190.Athma-Charitramu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 232

ఖిన్నుఁడనై, హృదయపరిశోధకుఁడగు దైవసమ్ముఖమునఁ గన్నీరు విడిచితిని. నాతమ్ముఁడు పిమ్మట నాకు వ్రాసిన జాబువలన నిందలి రహస్యము కొంత బయలుపడెను. నే నిటీవల నొక కాకినాడ స్నేహితునితో మనసిచ్చి మాటాడుచుఁ బ్రస్తాపవశమునఁ జెప్పిన సంగతు లాయన కనకరాజునకు నివేదింపఁగా, ఆతఁడు నా వ్రాఁతలకి ట్లపార్థ కల్పనఁ జేసెనని తేలెను ! ఈశ్వరభక్తులు తమ దుస్థితినిఁ దలపోయుచు దైవసాహాయ్యమును వేడుచుండు విషయమును, నేను కొంతకాలము నుండి కొన్ని యింగ్లీషు పత్రికలలోని వ్రాఁతల ననుసరించి, యుత్తమపురుషైకవచనముననే వర్ణించు నభ్యాసముఁ జేసికొంటిని. అట్లు వ్రాయుటకుఁ గారణము, పాఠకుల కందలి సంగతులు మఱింత స్పష్టముగఁ ద్యోతక మగుననియె. స్నేహితులు దీనికింత రట్టేలచేసి, యెన్ని కష్టములు పడియైన సత్యసంవర్థనికి వ్రాయుచుండు నాకు నిరుత్సాహముఁ గలిగించిరో, దురూహ్యముగ నుండెను !

1 వ జూలై తేదీని నాకు మృత్యుంజయరావు వ్రాసిన జాబులోఁ బూర్వోదాహృతమైన పత్రిక సంచికలోని భాగము తొలఁగింప నిర్ధారిత మైనటులుండెను. నేను దీనికి సమ్మతింప లేదు. నామనస్సు మిగుల వ్యాకులము నొందెను.

నా వ్యాకులచిత్తత కిది యొకటియే హేతువు కాదు. సతికి నాకునుఁ దగినట్టుగ మనస్సు గలియకుండెను. జూలై 2 వ తేదీని నాకు జీతము రాఁగా, ఆసొమ్ములోఁ గొంతతో నింటికిఁ గావలసిన పాత్రసామగ్రిఁ గొనుఁడని యామె పట్టుపట్టెను. రాజమంద్రిలోని కుటుంబవ్యయములకును, ఇతర కర్చులకును సొమ్ము వెచ్చింపవలసిన నే నట్లు చేయ లేకుంటిని. మాకిద్దఱికి నంత సంఘర్షణ మేర్పడెను. నా కామె లోభగుణ మారోపించి నన్నుగుఱించి యపోహములం దెను!