పుట:2015.373190.Athma-Charitramu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. పెద్దపలుకులు ! 153

పూఁటకూటిదానిని బరిహసించుట సిగ్గులచేటని నొక్కిచెప్పితిని. వీరి మధ్యనుండు సాంబశివరా వంత నందుకొని, నే నందఱిలోను మొనగాఁడ ననుకొని మిడిసిపడుచుంటి ననియు, ప్రార్థనసమాజమునకు నిరంకుశాధికారి నని భావించుకొనుచుంటి ననియు, తానుమాత్రము నన్నావంతయు లెక్కసేయ ననియుఁ జెప్పి వెడలిపోయెను ! ఇది జరిగిన యొకటిరెండు మాసములవఱకును నాతో నతఁడు మాటాడక, సదా మౌనమున నుండువాఁడు ! చనవరియు సరసుఁడునునగు సాంబశివరావే యిట్లు నాతో మాటాడకుండుటకు నేను వగచి, ఒకనాఁ డాతని బిలిచి, "జలపాత"సందర్భమున నే వాడిన నిష్ఠురోక్తులకు నన్ను మన్నింపు మంటిని. నాచెలికాఁ డంత పసిపాపవలె గోలుగోలున నేడ్చి, నామాటలకుఁ దా నేమియు తప్పుపట్టలే దనియును, తనజిహ్వ నరికట్టుటకే తా నీదీర్ఘమౌనవ్రతమవలంబించి ప్రవర్తనమున లాభ మందు చుంటి నని చెప్పెను ! పిమ్మట మే మిరువురమును వెనుకటివలెనే, మనసుగలసిన నేస్తుల మైతిమి.

కాని, యెల్లరును సాంబశివరావు వంటి నిష్కాపట్యహృదయులు గారు. మితిమీఱిన గర్వము నహంభావమును ప్రేరించుటచేతనే నే నిట్లు పెద్దమాటలు చెప్పుచున్నా నని యెంచి, ప్రార్థనసామాజికులలోఁ బలువురు నన్ను లోలోన ద్వేషించిరి. దీనిపర్యవసానము, కొంతవఱకు, కళాశాలాంత్యదినములలో నాకుఁ గానఁబడెను.

35. రంగనాయకులు నాయఁడు గారు.

నేను చెన్నపురి పోయి వచ్చినను, నా నేత్రములబాధ నివారణము గాలేదు. ఎక్కువసేపు చదివినను వ్రాసినను, కనులు మండుచుండును. "పెండ్లికి వెళ్లుచు పిల్లిని వెంటఁగోనిపోయిన" వానికివలె,