పుట:2015.373190.Athma-Charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఏకాంతజీవితము 107

పనుల యర్థము గ్రహింపని భారతనారుల దుస్థితిని తొలఁగింపు మని దయామయుఁడగు దేవదేవుని వేడికొంటిని.

మఱుసటినెల 20 వ తేదిని రాజగురు మృత్యుంజయరావులు నన్నుఁ గలసికొని, మిత్రులందఱమును గూడి చదువుకొనుట కొక పఠనాలయము స్థాపించుటనుగూర్చి నాయభిప్రాయము తెలుపుమనిరి. నేను సమ్మతింపక, దీనికి బదులుగా చందాలు వేసికొని బీదలకు సాయము చేయుట మేలని చెప్పితిని. నన్ను తమవైపునకుఁ ద్రిప్పుకొన పరిపరివిధముల వారు ప్రయత్నించినను, వారికి సాధ్యము కాలేదు. తమ మురిపఁపుపేళ్ల తో నన్ను వారు నిందించినను నేను నాపట్టు విడువలేదు. అంతట రాజగురువు, "నీబోటివా రిఁక నైదుగురు దొరికిరేని, రాజమంద్రి నంతటి నొక్కపట్టున సంస్కరణ వాహినియందు ముంపఁగలను !" అని చెప్పివేసెను. ఆతని యర్థము నాకు బాగుగ వ్యక్తము గాకున్నను, నా కధిక నైతికధైర్యము గలదని పలికినట్లు నమ్మితిని. నాకు ధైర్యసాహసము లింకను ప్రసాదింపు మని భగవానుని వేడుకొంటిని

30 వ సెప్టెంబరున నాకు శరీరమునందు నీరసము, కనుల బలహీనతయు నేర్పడుటచేత రాత్రి చదువు మానితిని. ఆనాఁడె కళాశాలలో అధ్యక్షుఁడగు మెట్‌కాఫ్‌దొర నన్ను గుఱించి మాటాడుచు, భాషాభాగమున నాచదువు బాగుగనున్నను, గణితమున మంచి కృషి చేసినఁగాని పరీక్షలో తప్పిపోవుదు వని నన్ను హెచ్చరించెను. ఆరాత్రి ప్రార్థనసమయమున నే నిట్లు తలపోసితిని : -

"ప్రభువా ! తన నియమితకార్యము సగము కొనసాగించిన పిమ్మటనే మిల్టనుకవి కంధత్వము సంప్రాప్తమయ్యెను. నాకర్తవ్య మొకిం