పుట:2015.373190.Athma-Charitramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఏకాంతజీవితము 105

నేను గూర్చుండుసమయమున శంభుశాస్త్రిగారు లేచి, కొన్ని మితసంస్కరణములు సూచించి, అవి మాసంఘమువా రవలంబించుట మంచిదని చెప్పెను. అంత నేను మరల లేచి, యీ సాంఘికవ్యాధికి బాల్యవివాహనిర్మూలనమే తగినచికిత్స యని వక్కాణించితిని. నాయీ తీవ్రసంస్కార పద్ధతి యావక్తను మరలమరల మాటాడ నుద్రేకింపఁగా నేనును సముచిత ప్రత్యుత్తరము లిచ్చుచువచ్చితిని. అంతట పాపయ్యగారు లేచి కొన్ని సామవచనములు చెప్పినమీఁదట, ఇంకొకవారమునకు సభ నిలిపివేసితిమి. పిమ్మట జరిగిన ప్రార్థనసమాజసభలో తమయధ్యక్షోపన్యాసమున వివాహసంస్కరణావశ్యకతను గూర్చి చెప్పుచు, వీరేశలింగముపంతులుగారు నా యభిప్రాయములను సమర్థించిరి. సభికు లందఱి మన్న నలకుఁ బాత్రమైన యగ్రపీఠము నధిష్ఠించినందు కెంతయు ముద మందితిని. నా పరిచితు లనేకు లానాఁడు సభ కేతెంచిరి. మధ్యమధ్య నాంగ్లేయపదములు పడి నేను గొంత చుట్టుత్రోవఁ ద్రొక్కినను, నాయుపన్యాసము నా నిశ్చితాభిప్రాయములను స్పష్టీకరించెను. నిజముగా నేను కీర్తి కెక్కు చుంటినా యని సంప్ర్రశ్నించుకొంటిని !

4 వ ఆగష్టు మధ్యాహ్నము పాఠశాలనుండి యింటికివచ్చినతోడనే, రేలంగినుండి యపుడె వచ్చిన మాతల్లిదండ్రులు తమ్ములు చెల్లెండ్రును గానఁబడి మోదమున మేము మిన్నందితిమి. ఇన్నాళ్ల నుండియు మువ్వురు సోదరులమును ఇంటిపను లన్న విసిగియుంటిమి. చదువుకొనుటకు వ్యవధాన మేమియులేదు. ఇంకముందు మా భారమంతయు తల్లి దండ్రులె వహింతురు గాన, క్రమముగఁ జదువుకొన వచ్చునని మేము సంతసిల్లితిమి. రాఁబోవు డిసెంబరులోనే నేను ప్రథమశాస్త్రపరీక్షకును, నాతమ్ముఁడు ప్రవేశపరీక్షకును బోవలయును గావున,