పుట:2015.373190.Athma-Charitramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. వెంకటరావు సావాసము 87

ములు చదివినాడు" అను నతిశయోక్తులు పలికి, మాతండ్రి నావ్యాసమును వినఁగోరెను. నే నేమి చేతును? బెదరు తీఱి నావ్యాసము చదివి, సంతోషభరితుఁడ నైతిని. భవిష్యత్తున నేను మాహావక్తనై యుపన్యాసములు గావించెద నని యుప్పొంగిపోతిని. ఒకటిమాత్రము నా కింతట స్పష్ట మయ్యెను. సంస్కరణమందు నాకుఁగల గట్టిపట్టుదల మానాయనకు ద్యోతక మయ్యెను. కాని, నాయాశయము లెన్నటికిని కార్యరూపముఁ దాల్చక, కేవల సంకల్పదశయందె యుండు నని మా తండ్రివాంఛ కాఁబోలు !

23. వెంకటరావు సావాసము

నా పూర్వమిత్రుఁడగు వెంకటరావు, ఆ దినములో తన యారోగ్యమునిమిత్తము రేలంగి వచ్చెను. అతనిమామగారు అక్కడనే జమిందారీయుద్యోయై, కుటుంబముతో నుండెను. వేసవి సెలవులు నేనును రేలంగిలోనే గడపుటచేత, నాస్నేహితునిఁ దఱచుగఁ గలసికొనుచు వచ్చితిని. వ్యాధిప్రకోపమువలన నానేస్తునిదేహము మిక్కిలి శుష్కించిపోయెను. ఆనవాలు పట్టలేని రీతిని శరీరము చిక్కియున్నను, అతని మాటలు, అతనివైఖరియును, వెనుకటివలెనే ఝంకరించుచుండెను ! ఆతఁడు రాజమంద్రి విడిచి వచ్చినపిమ్మట నచ్చటి సమచారములు, సంఘసంస్కరణసమాజ స్థాపనము, సారంగధరునిమెట్టమీఁది మాఫలాహారములు, అదికారణముగ బయలువెడలిన మాబహిష్కార వృత్తాంతములు, ఇవియన్నియు సమగ్రముగ నేను వినిపించి, సంస్కరణము పట్ల నతని సాహాయ్యసానుభూతులు స్నేహితుల మాశించుచుంటి మని పలికితిని. తా నెన్నఁడును తలంపనివిధమున మేము పట్టణమునఁ గార్యసాధనము చేయుచుండుట కాతఁడు ముదమంది, నే నభివృద్ధి నొందుట కభినందించెను.