పుట:2015.372412.Taataa-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. కార్మికసమస్య.

"స్వదేశీమిల్సు" స్థాపితమైనకాలమున, ఆప్రాంతమున ఒక కార్మికసమస్య కల్గెను. 1887 నాటికి బొంబాయి పరిసరమున సుమా రేబదిమిల్లు లేర్పడెను. ఇందొక్కొకమిల్లులో సుమారు వేయిమంది కూలీలు పనిచేయుచుందురు. ఆప్రదేశము పడమటికనుమలప్రాంతము; కొండనేల; అచటి జనసంఖ్య తక్కువ. కొన్ని యేండ్లవరకు బొంబాయి ప్రాంతీయులే కూలికి చాలిరి; కాని మిల్లులు వృద్ధియైనకొలదిని జనులు చాలలేదు; కూలీల గిరాకి హెచ్చెను. హెచ్చుకూలి నిచ్చినను పనివాండ్రు లేరైరి. గుజరాతులోని యహమ్మదాబాదులోను కొన్నిమిల్లు లేర్పడెను. అచటిజను లాప్రాంతమందే సరుదుకొనిరి; కాని కూలికి బొంబాయివరకు రారైరి. స్వస్థలమందే యుండుట మనదేశపు జనసామాన్యమున కలవాటైపోయినది. హెచ్చుజీతముకైనను, ఎరుగని దూరస్థలములకు వెళ్లుటకు మనవా రంతగా సిద్ధపడరు. కాని మిల్లువ్యాపారమునకు కూలిజనులు సమృద్ధిగ కావలెను; కార్మికులు చాలనిచో పని సరిగా జరుగదు; అట్టిచో కూలీలు సరిగా పనిచేయకున్నను, వారు సమ్మె కట్టుదమని బెదిరించినను, వేళకురాకున్నను, యజమానులే వారికి లొంగి యుండవలెను; పనిసరిగ జరుగదు. కనుక, ఇతరప్రాంతములనుండి బొంబాయికి పనివారల రప్పించుట యవసరమని జంషెడ్జితాతా గ్రహించెను.