పుట:2015.372412.Taataa-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా తనపనివాండ్ర కష్టములగమనించి, వారికి మంచి వసతిగృహముల నిర్మించెను. ఎక్కువ సమర్థులకు సాలీనాబహుమతులను, లాభములలో వాటాను గూడ, ఇచ్చుచుండెను. వారికి ప్రావిడెంటుఫండు పద్ధతినేర్పర్చి, సహాయముచేసెను. అందుచే వృద్ధులైనప్పుడా పనివాండ్రకు జీవనోపాధిలంభించును. ఆపనివాండ్రా యంత్రాలయము తమదనుభావముతో, ఉత్సాహముతో పనిచేయుచుండిరి. వారికై తాతా యుచితగ్రంథాలయమును, పఠనాలయమును నడిపెను; చిరకాలము పనిచేసి యశక్తతచే మానువారికి కొంతపారితోషికము గూడ నిచ్చుచుండెను. మనలో విద్యాధికులగు యువకు లుద్యోగములకే యత్నించుట యాచారమైనది; అట్లుగాక, ఉన్నతవిద్య నేర్చినవారికి పరిశ్రమలవైపు దృష్టి మరల్పదలచి, ఆయన కొందరుయువకులకు వ్యాపారోత్సాహము కల్గించి, వారిని సాలీనా ఎంప్రసుమిల్లులో చేర్చుకొని, వారికి పరిశ్రమల వివిధచర్యల నడుపువిధము నేర్పుచు, ఆతరిఫీయతుకాలమున వారికి కొంతజీతము గూడ నిచ్చుచుండెను. ఆయువకులు అందుమూడేండ్లు తమకిష్టమగు పరిశ్రమశాఖల నేర్చుకొని, అంతట తాతాసంఘమువారి కార్యాలయములోనే నిర్వాహకు లగుదురు; అందు ఖాళీలేనిచో, వా రితరత్ర పనిచేసుకొన వచ్చును. ఇట్లిందు నవీనవ్యాపార మర్మములందు తేలిన విద్యావంతులగు యువకులను బొంబాయి అహమ్మదాబాదుల మిల్లుదార్లు తమ మిల్లుల మేనేజర్లు (=నిర్వాహకులు)గ సంతోషముతో గ్రహించుచుండిరి.