పుట:2015.372412.Taataa-Charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపించి, ప్రసిద్ధమయ్యెను. ఈకంపెనీకి 'సెంట్రల ఇండియా స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్, అని పేరిడిరి.

జంషెడ్జి మేధావియగు 'దాదాభాయి' అను పార్సీ యువకుని తరిఫీయతుచేసి, అతని నీమిల్లుకు మేనేజరుగ నియమించెను. ఆయన తాతా యుద్దేశించిన కొత్తపద్ధతుల నమలులోనికి తెచ్చి, నిరంతరము కృషిచేయుచు, కార్మికుల బ్రోత్సహించుచు ఆమిల్లును వృద్ధిచేసెను. కొత్తపద్ధతులను ముందు సరిగా పరీక్షించి, అవి తృప్తికరమైనచో, (ఇతరయజమానులవలె జంకక) జంషెడ్జి ఎంత వ్యయప్రయాసములకైన సహించి, వెంటనే వానిని తనమిల్లులం దవలంబించెను. జనోపయోగము వ్యాపార వృద్ధియునే తనకు ముఖ్యముగ నెంచెను, కాని యాయన తన లాభమే ప్రధానముగ నెంచలేదు. అట్టి యాదర్శముతో, తన మిల్లులందు పాతబడిన యంత్రముల తీసివేసి, చాల హెచ్చుకిమ్మతువైనను, నవీనపరిశోధనల ననుసరించి తయారైన గుండ్ర కండెలను ఇంకను కొత్తపనిముట్లను తెప్పించి, తనమిల్లులందమర్చెను. అందువలన ఆయనమిల్లుల బట్టలు కొత్తరకపు మాంచెస్టరు సన్నబట్టలకును నాణెమున తీసిపోకుండెను. అవి యంతటను ఖర్చగుచుండెను. బిరారు నాగపురప్రాంతమున చక్కని ప్రత్తి పండును. ప్రత్తి పండు గ్రామముల మధ్యనే తాతా కొన్ని జిన్నింగు (=గింజలుతీయు) మిల్లుల నేర్పర్చెను. అచట కూలి చౌక. అందువల్ల దూది చాల చౌకగ తనమిల్లులకు చేరును; ఆగ్రామీణులకు నందుచే జీవనము నేర్పడెను.