పుట:2015.372412.Taataa-Charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

తాతా చరిత్రము


బొంబాయి యప్పటికే వ్యాపారరంగమై, జనసంకులమై యుండెను. ఈనగరము జంషెడ్జికి నూతనలోకముగ దోచెను ; అందు జనులంద రేదోయొక పని జేయుచుండిరి. జ్ఞానార్జన కందు చాల సౌకర్యము లుండెను. ప్రభుత్వకళాశాలయందు శాస్త్రవేత్తలు విద్యను విజ్ఞానమును బోధించుచుండిరి. జంషెడ్జి అం దారేండ్లు చదివి, పరీక్షలో కృతార్థుడై, 1858 లో విద్యను ముగించెను.

అతడు 17 వ యేట నే 'హీరాబాయి' అను పార్సీ బాలికను వివాహమాడెను ; 1860లో వారి జ్యేష్ఠపుత్రుడగు దోరాబ్జితాతా కలిగెను.

అప్పటికి వకీళ్లు అరుదు; న్యాయవాదివృత్తి చాల ఆకర్షముగ నుండెను. తండ్రి జంషెడ్జిని న్యాయవాదిగనే చేయ దలచి, ఆతని నొక సొలిసిటరు కార్యాలయమున జేర్చెను.*[1] అతడందే యుండినచో సామాన్యజీవితమే గడపియుండును. అట్లు జరుగక, 1859లోనే దానిని వదలి, జంషెడ్జి తనతండ్రి కొట్టులో జేరి, అందు వ్యారసూత్రముల నేర్చుకొనెను. అదృష్టవశమున నట్లు వృత్తి మారి, జంషెడ్జి వ్యాపారనాయకు డగుట సంభవించెను.

  1. * కోర్టులో వాదముచేయక, నోటీసుల బంపుట, దస్తావేజులను ప్లయింటులు నోటీసులు మున్నగువాని వ్రాయుట, సలహాల నిచ్చుట మున్నగు తక్కిన న్యాయవాది కార్యము లన్నిటిని జేయువారు 'సొలిసిటరు' లనబడుదురు.